ప‌ల్ల‌వించాలి

మనిషి మనిషిగా చూడండి అంటే నేరమా????

ఎవ్వరూ మాట్లాడటం లేదు. మనసులో ఉన్న మంచి భావాలను కూడా వెల్లడించడానికి మహా భయపడిపోతున్నారు. బూస్ట్‌ తాగితే నాలాగా బలం వస్తుందని బల్లగుద్ది చెప్పినవాడూ ఇప్పుడు మాట్లాడడు. థమ్స్‌అప్‌ తాగమని తెగ చెప్పేవాడు, ముఖ సౌందర్యానికీ, మేని మెరుపుకూ ఈ సబ్బు మాత్రమే వాడండని చెప్పే మన అభిమాన తారలెవ్వరూ నోరు విప్పరు. అదేమి చిత్రమో ధైర్యంగా గొంతు విప్పిన తోటి తారకు మాటసాయమూ చేయరు. ఇంత వెన్నుముక లేని జీవనము మన అభిమాన హీరో, హీరోయిన్లది! ఇలాంటి సందర్భంలో సినీనటి సాయిపల్లవి నిజమైన నాయికగా నిలబడింది. తన మనసులోని మానవీయ కోణాన్ని నిర్భయంగానే వెల్లడించింది. అందమైన నటిగా అందరినీ ‘ఫిదా’ చేసిన ఆమె, ఇప్పుడు అందమైన మనసూ ఉందని రుజువు చేసింది.ఏమన్నదామే. మనుషులకు మానవత్వముండాలన్నది. మతం ఆధారంగా ఒకరు ఇంకొకర్ని చంపటం తప్పన్నది. బాధితులవైపు మన ముండాలి, రక్షించాలంది. ”కాశ్మీర్‌ ఫైల్స్‌”లో పండితులను చంపిన దానికి, ఆవులను బండిలో తీసుకుపోతున్నారని జై శ్రీరాం అంటూ ముస్లింలను కొట్టి చంపిన దానికీ తేడా ఏముంది! రెండూ అమానవీయమే. ఎప్పుడయినా మనం న్యాయం వైపు నిలబడాలి, పోరాడాలి” అని తన సినిమా ఇంటర్వ్యూలో భాగంగా తన అంతరంగాన్ని వివరించింది.

ఇక అంతే, సాయిపల్లవిపై విపరీతమైన దాడి మొదలైంది. కేసులు కూడా పెట్టారు. ఇష్టం వచ్చినట్టు సోషల్‌ మీడియాలో తిట్టారు. వక్రతార అన్నారు. మాంసాహారన్నారు (నిజానికామె శాఖాహారి), నీ మూల చరిత్ర తెలుసుకో అన్నారు. ఆ భాష వాళ్లకు తప్ప మరెవరికీ రాదు. ఆమె సినిమాలు బహిష్కరించాలనీ పిలుపులిచ్చారు. ఇంత జరుగుతున్నా బయట ప్రజా సంఘాలు, ప్రగతిశీలురు తప్ప ఒక్క సినీ కళాకారుడూ ఆమెకు సంఘీభావంగా మాట్లాడలేదు, నిలబడలేదు. తెలుగు సినీ రంగం మరీ చైతన్యరహితంగా తయారైంది. బాలీవుడ్‌లో దీపికాపదుకొనే, తర్వాత స్వర్ణభాస్కర్‌ మొదలైన సినీ నటీ మణులు ధైర్యంగానే సామాజిక విషయాలపై స్పందించారు. వారినీ వేధింపులకు గురి చేశారు.సాయిపల్లవి సంఘటన, సంప్రదాయ భారతీయ సామాజికులందరికీ ఒక పాఠంలా నిలుస్తుంది. ఎందుకంటే ఆమె లెఫ్టిస్టుకాదు, రైటిస్టూకాదు. పోనీ నాస్తికురాలూ అంతకంటే కాదు. సంపూర్ణంగా భక్తితో దేవుణ్ణి పూజిస్తూ, సంప్రదాయాలను గౌరవించే సాధారణ మహిళాతార. మనుషులందరూ మానవత్వం కలిగి ఉండాలన్నది. మత హింస పనికిరాదన్నది అంతే. ఎవరు ఎవర్ని చంపటమైనా నేరమేనన్నది. దీనికే భజరంగీయులు, ఆరెస్సెస్సీయులు ద్వేషాన్ని వెల్లగక్కు తున్నారు. ఈ దేశంలో ఆస్తికులయిన వారూ, ఆధ్యాత్మికులూ, మానవీయంగా బ్రతకాలని కోరుకునే వాళ్ళు అశేష ప్రజానీకం ఉన్నారు. వారందరూ వీళ్ళు చేసే మతహిం సకు కానీ, విద్వేషాలకు విధ్వంసాలకు గానీ వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా సహించలేరు. అప్పుడు వాళ్లకు హిందూ, ముస్లిమనే తేడా కూడా ఉండదు. దాడికి పూనుకుంటారు. అందుకే మానవీయ ఆధ్యాత్మికులందరూ నేడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అరాచక, విధ్వంసక మూకల ఆలోచనలను సమిష్టిగా ఎదుర్కోవాలి. మానవతను కాపాడుకోవాలి.

ఇది సాయిపల్లవికి ఎదురయిన సమస్య మాత్రమే కాదు. అన్యాయంగా చంపడాన్ని, బుల్డోజర్‌ న్యాయాలను, వ్యతిరేకించే వారందరికీ ఎదురయ్యే సమస్యగానే ఉంది. దేశంలోనే పెద్ద సాంస్కృతికరంగమైన సినీ పరిశ్రమలోనూ ఛాందస, తిరోగమన, మతతత్వ భావాలను తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలలోనూ వాటిని గమనించవచ్చు. అయితే దానికి ప్రతిఘటన కూడా కొనసాగుతున్నది. సాధారణంగా సినిమాలలో నాయకా, నాయికలు ఉత్తమ వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. బయట కూడా అలానే ఉంటారని మనం భ్రమపడుతుంటాము. డబ్బు, వ్యాపారమూ, అవకాశవాదమూ, అన్నింటి ప్రభావమూ పెరిగిపోయిన ఈ రంగంలో తెర లోపలి మనుషులు వేరుగానే ఉంటారు.అయితే ఇట్లాంటి సందర్భంలో కూడా ఉన్నతమైన పాత్రల ఎంపికతో పాటు ఉత్తమ కథాంశాలు కలిగిన చిత్రాలలోనే నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న నటి సాయిపల్లవి. నటనే కాదు ఆమె వ్యక్తిత్వమూ ఉన్నతంగానే ఉంది. రెండు కోట్ల రూపాయలు ఆదాయంగల ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ప్రకటనలో నటించటానికి నిరాకరించింది. వాటి పరిశీలన ఫలితాలు తెలియకుండా నటించనని తేల్చి చెప్పింది. అవకాశాల కోసం వెంపర్లాడకుండా తనకు వచ్చిన వాటిలో నచ్చిన పాత్రల్లోనే నటిస్తూ, సామాజిక విషయాల పట్ల అవగాహనే కాక నిర్భయంగా విషయాలను అభివ్యక్తీకరించే ఆమెకు అండగా ఉండటం నిజంగా ఇప్పుడు అవసరం. అందుకే పల్లవి వెనకాల చరణాలుగా రాగాలెత్తాలి మనం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here