Producer ‘Sravanti’ Ravikishore’s debut Tamil film ‘Kida’ is selected for Indian Panorama at IFII

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ను ఈ రోజు వెల్లడించారు. ఫీచర్ ఫిల్మ్స్‌లో సుప్రసిద్ధ తెలుగు నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ సినిమా ‘కిడ’ ఒకటి. 

‘కిడ’లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ‘‘ఆర్ఏ వెంకట్ ఈ ‘కిడ’ కథను చెప్పినప్పుడు ఇందులో విషయం ఉందని అర్థమైంది. అందరికీ కనెక్ట్ అవుతుందని వెంటనే ఓకే చేశా. ఇది పేరుకు తమిళ చిత్రమే. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా యూనివర్సల్ అయ్యింది. భాషలకు అతీతంగా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఏ భాషలో సినిమా తీసినా సరే అన్ని భాషల ప్రేక్షకులకు చేరువ అవుతుందనే ఉద్దేశంతో తమిళంలో తీశాం. మూడున్నర దశాబ్దాల మా స్రవంతి మూవీస్ ప్రయాణంలో తొలి తమిళ చిత్రమిది. తమిళనాడులోని మధురై జిల్లాలో కంబూర్ అనే కుగ్రామంలో ‘కిడ’ చిత్రీకరణ చేశాం. దీపావళి అనేది అందరికీ పెద్ద పండగ. ముఖ్యంగా తమిళ ప్రజలకు, అక్కడి చిన్నారులకు దీపావళి ఇంకా పెద్ద పండగ. పండక్కి కొత్త దుస్తులు కొనుక్కోవడం ఆనవాయితీ. పల్లెల్లో ఎవరైనా సరే తమ తాహతుకు మించి పిల్లలకు కొత్త దుస్తులు కొనివ్వాలని తాపత్రయపడుతుంటారు. కొనిచ్చిన తర్వాత తామే దుస్తులు ధరించినట్టు ఆనందపడతారు. ఆ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. మనవడి కోసం ఓ తాతయ్య తనకు తానే ఓ ఛాలెంజ్ విసురుకుంటాడు. ఆ ఛాలెంజ్ ఏమిటన్నది సినిమాలో చూడాలి. అది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి మనసులను తాకే భావోద్వేగాలు సినిమాలో ఉన్నాయి. ఎమోషనల్ చిత్రమిది.  ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా – 2022లో ప్రదర్శనకు ఇండియన్ పనోరమా మా సినిమాను ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. తమిళం నుంచి ‘జై భీమ్’తో పాటు ‘కిడ’ను ఎంపిక చేయడం మరింత ఆనందకరంగా ఉంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. అన్ని భాషల్లో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు.

నవంబర్ 20 నుంచి 28 వరకు 53వ గోవాలో ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ను నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here