Ilayaraja Music live Show as grand as never before

మాస్ట్రో ఇళయరాజా లైవ్ షోకి హైదరాబాద్ మరోసారి వేదికయింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇళయరాజా లైవ్ షో సంగీత ప్రియులని, అభిమానులని అలరించింది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో లైవ్ షో ప్రారంభమయి ఇళయరాజా పాడిన జననీ జననీ పాటతో మొదలైన మ్యూజికల్ ట్రీట్ ఆద్యంతం ఆకట్టుకుంది. కార్తిక్ పాడిన ఓం శివోహం పాట ప్రేక్షకుల్లో గొప్ప ఉత్సాహాన్ని తెచ్చింది.

ఎన్నో రాత్రులోస్తాయిగానీ, మాటే మంత్రము, కలయా నిజమా పాటలని ఇళయరాజా స్వయంగా ఆలపించి అలరించారు. ఈ లైవ్ షో లో దాదాపు 35 పాటలు అలపించగా రీటెకులు, అపశ్రుతులు దొర్లకుండా లైవ్ షో ని కండక్ట్ చేయడంలో ఇళయరాజా మరోసారి తన మార్క్ చూపించారు.

మనో, ఎస్పీ చరణ్ .. బాలు లేని లోటుని తీర్చడానికి తమ శక్తి మేరకు ప్రయత్నించగా కార్తిక్, శరత్ లు ఆకట్టుకున్నారు. చివర్లో సింగారాల పైరుల్లోన పాట స్టేడియంని సందడిగా చేసింది. ఫిమేల్ సింగర్స్ విభావరి, శ్వేత, సునీత, శీరిష, అనిత తమ గాన మాధుర్యం తో అలరించారు.

ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఏళ్ళు గడుస్తున్నా అందులో వున్న ఫ్రెష్ నెస్ కొంచం కూడా తగ్గదు, ఎన్ని సార్లు విన్నా అదే ఎమోషన్ కనెక్ట్ అవుతుంది అందుకేనేమో ఆయన్ని మ్యూజికల్ గాడ్ అంటారు.

ఒక పాట తయారీ వెనుక ఎలాంటి శ్రమ వుంటుంది ? ఎంత సృజన అవసరమో .. ఓ ప్రియ ప్రియ.. పాటలో వచ్చే ఒక ఇంటర్ల్యుడ్ తో ప్రేక్షకులకు వివరించారు రాజా. ఎన్ని లేయర్లలో వర్క్ జరుగుతుందో చెప్పి.. ఇలా సంగీతాన్ని ప్రేక్షకులకు చెప్పే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా వున్నారా ? అని ప్రశ్నించి.. ‘ఎవరు లేరు..నేను మాత్రమే ఇలా చెప్తాను’ అని ఇచ్చిన సమాధానంతో మైదానంలో చప్పట్లు మారుమ్రోగాయి.

ఎనభై ఏళ్ల వయసులో మూడున్నర గంటల పాటలు ఒక్క సెకన్ కూడా కూర్చోకుండా ఆయన లైవ్ కండక్ట్ చేయడం అందరినీ సర్ప్రైజ్ చేసింది.

ఇళయరాజా లైవ్ షో అంటే బాలు వుంటే ఆ సందడే వేరు. పాటలతో పాటు మంచి సరదా కబుర్లు వుంటాయి. ఇళయరాజాని.. ఏరా అని పిలిచే చనువు బాలుకుంది. రాజా మ్యూజిక్ లోని గ్రేట్ నెస్ బాలు చెబుతుంటే ఆ మ్యాజిక్ వేరుగా వుంటుంది. అదొక్కటే ఈ షో లో మిస్ అయ్యింది. పాటల వెనుక వున్న కబుర్లు చెప్పే మనిషే కనిపించలేదు.

దేవిశ్రీ ప్రసాద్ ఇళయరాజకి భక్తుడు. రాజా లైవ్ షో ఎక్కడున్న రెక్కలు కట్టుకొని వాలిపోవడం దేవిశ్రీకి అలవాటు. గచ్చిబౌలి స్టేడియంలో కూడా దేవిశ్రీ సందడి కనిపించిది. ప్రతి పాటకు పరవశించిపోయారు. జగడ జగడ జగడం పాటకైతే కూర్చున్న చోటే డ్యాన్స్ చేశారు. స్టేజ్ మీదకి వెళ్లి ‘’మీ పాటకి మా మనసులు, ప్రాణాలు, జీవితాలే ఊగుతున్నాయి. రాజా గారికి దేశం భాషతో పని లేదు. ఆయన మన మనసులో నిండిపోయారు’’ అని తన ఆనందం పంచుకున్నారు.

టాలీవుడ్ నుంచి నాని, హరీష్ శంకర్, బుచ్చిబాబు, మంచు లక్ష్మీ, ఇషా రెబ్బా, వర్ష బొల్లమ్మ..చాలా మంది ప్రముఖులు హజరయ్యారు.

లైవ్ షో లో కళాతపస్వి కె విశ్వనాథ్ కి అంజలి ఘటించారు ఇళయరాజా. సాగరసంగమం, స్వాతి ముత్యంలోని వేదం అణువణువున తకిట తధిమి తందాన, మౌనమేలనోయి, లాలి లాలి పాటలతో కె విశ్వనాథ్ కి నివాళి అర్పించారు.

తాజా లైవ్ షోలో ఎక్కువగా యువత కనిపించింది. స్టేడియంలోని అన్ని సెక్షన్ లు నిండిపోయాయి. షో పూర్తయ్యే వరకూ ఫుల్ క్రౌడ్ వుంది. తాము అభిమానించే పాటల స్వరకర్తని ప్రత్యేక్షంగా చూసి … ఇలాంటి పాటల రాత్రులు మళ్ళీ మళ్ళీ రావాలని మేస్ట్రో మ్యూజికల్ నైట్ ని ఎంజాయ్ చేశారు వీక్షకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here