Mass Ka Das Vishwak Sen, Sithara Entertainment’s ‘Gangs of Godavari’ trailer is intense and riveting!

కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి అంజలి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు నిర్మాతలు.

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం మే 25 తేదీన సాయంత్రం హైదరాబాద్‌లోని దేవి 70 ఎంఎం థియేటర్‌లో జరిగింది. అభిమానుల కేరింతల నడుమ చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది.

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, తన కెరీర్ లో ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని.. సినిమా పట్ల తనకున్న నమ్మకాన్ని అభిమానులతో పంచుకున్నారు విశ్వక్ సేన్. ఆయన మాటలను నిజం చేసేలా ట్రైలర్ అద్భుతంగా రూపొందించబడింది.

“లంకల రత్న” అనే శక్తివంతమైన పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తున్నారు. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అమోఘం. తనదైన ఆహార్యం, అభినయంతో పాత్రకు నిండుదనం తీసుకొచ్చారు. “లంకల రత్న” పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో సందేహం లేదు. సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన ఆ పాత్ర ప్రయాణం ఎలా ఉండబోతుందో చూపించిన తీరు.. సినిమా పట్ల ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

ఆకట్టుకునే పోరాట సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మనుషులను మూడు వర్గాలుగా వివరించే పాత్రతో ట్రైలర్ ప్రారంభమైతే, కథానాయకుడు వారిని “మగ”, “ఆడ” మరియు “రాజకీయ నాయకులు”గా వర్గీకరించడంతో ముగుస్తుంది. అలాగే, లంకల రత్న పలికే సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు కృష్ణ చైతన్య ప్రతిభ ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది.

సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉండబోతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనిత్ మదాడి కెమెరా పనితనం కట్టి పడేసింది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కూడా తనదైన నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నారు.

కథానాయిక పాత్రలో నేహా శెట్టి ఎంతో ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తున్నారు. అంజలి పాత్ర కూడా ఆకట్టుకుంటోంది. ఆమె పాత్రకు లంకాల రత్నతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా కనిపిస్తుంది.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here