Active Telugu Film Producers Guild Press Note

మన చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులను కించపరిచేలా తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫీసర్‌ బేరర్స్‌ సమక్షంలో పలువురు చేసిన వ్యాఖ్యలను యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తీవ్రంగా ఖండిస్తోంది.

మేం మళ్లీ మళ్లీ చెప్పేది ఏంటంటే…
తొలుత సినిమా నిర్మాణాన్ని ప్రారంభించేది నిర్మాతే. నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి సినిమాకు పునాది వేసేది నిర్మాతే. ప్రాథమికంగా థియేటర్లలో విడుదల చేయాలని ఎల్లప్పుడూ భావిస్తాడు. గతంలో శాటిలైట్‌, ఇప్పుడు వివిధ ఓటీటీ మాధ్యమాల రాకతో… ఈ మార్గాలు అన్నిటి ద్వారా నిర్మాత తన పెట్టుబడిని రాబట్టుకుంటాడు. తన చిత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేయాలనే నిర్ణయం తీసుకునే హక్కు నిర్మాతది.

ఓటీటీ మాధ్యమంలో తమ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న హీరో, నిర్మాతను సభాముఖంగా విమర్శించడం, వ్యక్తిగతంగా బెదిరించడం సరికాదు. ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం అనిపించుకోదు. తన చిత్రంపై సర్వహక్కులు నిర్మాతకు చెందుతాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో మార్కెట్‌ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. అందువల్లే, పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేకంగా ఒక హీరోను ఎవరైనా టార్గెట్‌ చేయడం ద్వారా పరిశ్రమలోని ఆరోగ్యకర, స్నేహపూర్వక సంబంధాలను దెబ్బ తీస్తుంది. నిర్మాతలు/హీరోలు/సాంకేతిక నిపుణులు ఎవరైనా ఒంటరి కాకూడదు. ఏ సెక్టార్‌ చేత వెలివేయబడకూడదు.

పరిశ్రమ ఎదుర్కొంటోన్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి నిర్మాతలకు సహాయపడమని వివిధ వేదికల్లో ఎగ్జిబిటర్లకు మేం విజ్ఞప్తి చేశాం. ఇవాళ, ఎగ్జిబిటర్లు కేవలం విపరీతమైన డిమాండ్‌ ఉన్న సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్న,  ఓ మాదిరి చిత్రాలను పట్టించుకోవడం లేదు. వాటిని విస్మరిస్తున్నారు. దాంతో చాలా చిత్రాలు వివిధ మార్గాల ద్వారా తమ పెట్టుబడిని రాబట్టుకుంటున్నాయి.

నిర్మాతల మనుగడను ఎవరూ / ఏ రంగమూ నిర్దేశించకూడదు. బెదిరించకూడదు.

పరిశ్రమ పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, వివిధ వ్యాపార భాగాస్వాములు…. పరస్పరం ఒకరిపై మరొకరు ఆధారపడిన పరిశ్రమ మనది. వ్యక్తిగతంగా, పరిశ్రమగా మనమంతా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నాం. అన్ని సెక్టార్లు కష్టకాలంలో ఉన్నాయని మేం అర్థం చేసుకున్నాం. వారితో పాటు మేం బాధపడుతున్నాం. పరస్పన మద్దతు ఆశిస్తున్నాం. గతంలో మనం ఎదుర్కొన్న సమస్యలకు అందరం కలసికట్టుగా పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన సమయం వచ్చిందని మేం భావిస్తున్నాం.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం మనమంతా సమష్టిగా పని చేయాలి.

ఇట్లు,
యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here