Ex Chief Minister Kotla Vijayabhaskara Reddy Statue inauguration held grandly in Chitrapuri Colony

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు ముఖ్యంగా చిత్రపురి కాలనీ అంకురార్పణలో ఆయన అందించిన సహకారానికి గుర్తుగా ఆయన జయంతి (ఆగష్ట్‌ 16)ని పురస్కరించుకుని చిత్రపురి కాలనీ డబుల్‌ బెడ్‌రూమ్‌ కమాన్‌ దగ్గర కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చిత్రపురి కాలనీ అసోసియేషన్‌ వారు. 1994లో జీ.ఓ నెంబర్‌`658 ద్వారా 65 ఎకరాల 16 గుంటల స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. ఇందుకోసం నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ఎంతో చొరవ తీసుకున్నారు. బుధవారం జరిగిన ఈ విగ్రహావిష్కరణలో ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్‌ రాజు, ప్రముఖ నిర్మాతలు యం. శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, సి. కళ్యాణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి కోశాధికారి ప్రసన్న కుమార్‌,ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ దామోదర్‌ ప్రసాద్‌, చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ కుమార్‌, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత యం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ…తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడాలంటే ముందుగా కార్మికులకు గృహ సౌకర్యం ఉండాలని కోరుకున్న వ్యక్తుల్లో దివంగత విజయభాస్కరరెడ్డి గారు ఒకరు. ప్రభాకర్‌రెడ్డిగారి ఆలోచనను ప్రోత్సహిస్తూ విజయభాస్కరరెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చిత్రపురి కాలనీ అంకురార్పణకు ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అదించారు. ఈరోజు చిత్రపురిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్‌రాజు మాట్లాడుతూ…చిత్రపరిశ్రమ మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడటానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. పెద్దలు ప్రభాకరరెడ్డి గారు, కోట్ల విజయభాస్కరరెడ్డి గార్లు చేసిన కృషిని ఇవాళ మనం స్మరించుకోవడం సంతోషంగా ఉంది. విజయభాస్కరరెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోం అని చెప్పకనే చెప్పారు చిత్రపురి వాసులు. ప్రపంచంలో ఎక్కడా సినీ కార్మికుల కోసం ఇంత పెద్ద కాలనీ లేదు. ఇది మనందరికీ గర్వకారణం. సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని వర్గాల వారికీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అందరం సమష్టి కృషితో ముందుకు వెళ్లడం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ గురించి భారతీయ చిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్దాం అన్నారు.

నిర్మాత సి. కళ్యాణ్‌ మాట్లాడుతూ…చిత్ర పరిశ్రమకు చెందిన కార్మికులకు స్వంత ఇంటి కలను నెరవేర్చడంలో విజయభాస్కరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన కృషికి గుర్తుగా ఈరోజు చిత్రపురి కాలనీ అసోసియేషన్‌ విజయభాస్కరరెడ్డిగారి విగ్రహాన్ని ఆవిష్కరంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మరింత ఆనందంగా ఉంది. చిత్రపురి మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అన్నారు.

చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ…1994లో చిత్రపురి కాలనీ అంకురార్పణకు మూల పురుషుడైన డా॥యం. ప్రభాకరరెడ్డి గారు, ఇతర సినీ పెద్దలు సినీ కార్మికుల స్వంత ఇంటి కలకు సంబంధించి చేసిన విజ్ఞప్తిని మన్నించి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డి గారు ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని పర్మిషన్‌లను ఇప్పించి పెద్ద మనసు చాటుకున్నారు. 1994 ఆగష్ట్‌ 16న చిత్రపురి కాలనీకి తొలి అడుగు పడింది. ఈరోజు కోట్ల విజయభాస్కరరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ద్వారా ఆయనకు మా ఘన నివాళి అర్పిస్తున్నాం. చిత్ర చిత్రపురి కాలనీ విషయంలో అన్ని పార్టీల ప్రభుత్వాలు సహకరిస్తూ రావడం వల్ల ఈరోజు ఇంత అభివృద్ది చెందింది. రాబోయే రోజుల్లో మరింతగా కాలనీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చిత్రపురిలో ఇప్పటి వరకు ఫ్లాట్స్‌లేని వారికి కూడా 362 ఫ్లాట్స్‌ నిర్మాణాలను పూర్తి చేస్తాం అన్నారు.

దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ…చిత్రపురి కాలనీ అంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది ప్రభాకరరెడ్డి గారి గురించి, విజయభాస్కరరెడ్డి గారికి గురించి. వాళ్లకు ఈ కాలనీపట్ల నిర్మాణం పట్ల ఉన్న చిత్తశుద్ధి వల్లనే ఇంత దూరం రాగలిగాం. గతంలో జరిగిన విషయాలను వదిలిపెట్టి అందరూ కలిసి పనిచేస్తే.. మరింతగా అభివృద్ది చెందుతుంది చిత్రపురి. వీలైనంత త్వరగా మిగిలిన కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ….మొదట నేను అసోసియేషన్‌ మెంబర్‌ను కాదు. అయినా హనుమంతరావు గారు నా మెంబర్‌షిప్‌ అమౌంట్‌ కట్టి మరీ నాకు మెంబర్‌షిప్‌ ఇచ్చారు. ఆ తర్వాత నన్ను సెక్రటరీగా గెలిపించుకున్నారు. అప్పటికి మొత్తం 67 ఎకరాలను గాను 20 ఎకరాలకు మాత్రమే సొసైటీ ప్రభుత్వానికి డబ్బులు కట్టింది. ఆ సమయంలో అసలు ఈ సొసైటీనే భోగస్‌ అంటూ వివాదాలు చెలరేగాయి. మొత్తానికి ఎలాగొలా కష్టపడి ఆ వివాదాలను దాటుకుని మిగిలిన 47 ఎకరాలకు డబ్బులు కట్టి, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. ఈ కాలనీ నిర్మాణంలో ప్రతి రూపాయి కార్మికులు ఇచ్చినవే. ఎవరూ డొనేషన్‌లు ఇవ్వలేదు. కె.బి. తిలక్‌ గారు, హనుమంతరావు గారు, యం.యస్‌. రెడ్డి గారు చాలా కృషి చేశారు. ఆ తర్వాత నేను, సి. కళ్యాణ్‌ కూడా చాలా కష్టపడ్దాం అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న చిత్రపురి కాలనీ వాసులు కోట్ల విజయభాస్కరరెడ్డి గారి విగ్రహానికి ఘన నివాళి అర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here