FCA Services are Commendable…-Virahat Ali

సినిమా విభాగంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. టీ.యూ.డబ్ల్యూ.జే కు అనుబంధంగా త్వరలో బషీర్ బాగ్ కార్యాలయం నుండి తన కార్యకలాపాలను ఉధృతం చేయనున్న సందర్భంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ముఖ్య నాయకులు ఇవ్వాళ సమావేశమయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజరైన విరాహత్ అలీ మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి ఎంత చరిత్ర ఉందో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు అంతే చరిత్ర ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యూజే ఆవిర్భావం నుండే ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అనుబంధంగా పనిచేస్తుందన్నారు.కరోనా కష్టాల్లో ఫిల్మ్ జర్నలిస్టులకు అండగా నిలబడి వారి సంక్షేమం కోసం అసోసియేషన్ చేసిన సేవలు ప్రశంసనీయమని విరాహత్ అన్నారు.

అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్ కొండేటి, ఇ.జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ… తమ సంఘానికి పూర్వవైభవం తీసుకురావడానికి ముమ్మరంగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే బషీర్ బాగ్ లోని దేశోధ్ధారక భవన్లో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. తమకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న ఐజేయూ, టీ.యూ.డబ్ల్యూ.జే నాయకత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

అసోసియేషన్ ముఖ్యులు ఏ.ప్రభు, కె.లక్ష్మణ్ రావు, మాడూరి మధు, పి.రాంబాబు, ఆర్.డీ.ఎస్.ప్రకాష్, హేమ సుందర్, మురళీ కృష్ణ, నారాయణ రావు, జిల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here