Heroine MALAVIKA SHARMA interview about Red Movie

వాణిజ్య ప్రకటనల కోసం దుబాయ్‌, థాయ్‌లాండ్‌ లాంటి వివిధ దేశాలకెళ్లి చిత్రీకరణ చేస్తాం.కొత్త వ్యక్తులను కలుస్తాం..సరదాగా ఉంటుంది.నటించడం సులభమమే కానీ, సినిమాల్లో అలా కాదు. పాత్రను అర్థం చేసుకుని, భావోద్వేగాలను తెరపైకి తీసుకురావాలి అని మాళవికా శర్మ అన్నారు.మొదటి సినిమా నేల టిక్కెట్టుతో స్టార్‌ హీరో రవితేజ సరసన టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, రెండేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ తెలుగులో ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన నటించే అవకాశం కొట్టేసింది. రామ్ హీరోగా, మాళవిక శర్మ, నివేతా పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్లుగా  కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవి కిషోర్ నిర్మించిన చిత్రం ‘రెడ్’. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో మాళవికా శర్మ బుధవారం మీడియాతో  మాట్లాడుతూ…

*2018లో నేను ‘నేలటిక్కెట్టు’లో నటించాను.అప్పుడు లా కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్నాను.ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌ వి.పట్టాభిగారి దగ్గర క్రిమినాలజీలో స్పెషలైజేషన్‌ చేశా. హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నప్పుడు నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌గారి ఆఫీసు నుంచి ఫోన్‌ వస్తే…వెళ్లి కలిశా.నిర్మాత రవికిషోర్‌, దర్శకులు కిషోర్‌ తిరుమల కథ వివరించారు. కథ వినగానే నా పాత్ర నచ్చి ఓకే చెప్పేశాను.అభినయానికి ఆస్కారమున్న పాత్ర కావడంతో ఆడిషన్‌ చేయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు.అయితే, కథలోంచి ఓ సన్నివేశం చేసి చూపించమన్నారు. ఆ తర్వాత లుక్‌ టెస్ట్‌ చేసి నన్ను ఎంపిక చేశారు.

*రామ్‌ సెట్‌లో చాలా నిశ్శబ్దంగా ఉండేవారు. కానీ ఒక్కసారి యాక్టింగ్‌లో దిగగానే ఆయన ఎంతో ఎనర్జీగా ఉండేవారు. అందుకే ఆయనను ఎనర్జిటిక్‌ స్టార్‌ అంటారేమో!ఎప్పుడూ కొత్తగా ఏదైనా చేయాలనే తపన అతనిలో గమనించా. సినిమాలో తాను, తన పాత్ర మాత్రమే కాకుండా… ప్రతి ఒక్కరూ బాగా నటించాలని, ప్రతి ఒక్కరికీ పేరు రావాలని కోరుకుంటారు. తోటి నటులకు అండగా నిలబడతారు. అదీ రామ్‌ గొప్పతనం. ‘రెడ్‌’ చిత్రీకరణలో తొలి రెండు రోజులు చాలా టేక్స్‌ తీసుకున్నా. సినిమాలకు నేను కొత్త అని అర్థం చేసుకుని, ఓర్పు-సహనంతో సీన్‌ బాగా చేసేవరకూ వేచి చూశారు. రామ్‌లో ఆ లక్షణం నాకు ఎంతో నచ్చింది.

*హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధించడానికి ఒక్క రోజు ముందువరకూ హైదరాబాద్‌లో చిత్రీకరణ చేశాం. మూడు రోజుల పనిని ఒక్క రోజులో పూర్తి చేశాం. ఇటలీలో కరోనా విజృంభణకు ఐదు రోజుల ముందువరకూ అక్కడ చిత్రీకరణ చేశాం. ఇండియాలో, ఇటలీ వెళ్లేటప్పుడు విమానంలో మాస్క్‌ ధరించా. శానిటైజర్లు రాసుకున్నా. యూరప్‌ వెళ్లగానే ‘ఇక్కడ కరోనా కేసులేవీ లేవు. మాస్క్‌, శానిటైజర్స్‌ ఎందుకు?’ అని పక్కనపెట్టేశా. తిరిగొచ్చాక యూరప్‌లో కేసుల విషయం తెలిసింది. థ్యాంక్‌ గాడ్‌… అదృష్టవశాత్తూ మాకు ఏమీ కాలేదు.లాక్‌డౌన్‌లో జరిగిన మంచి విషయం ఏంటంటే… సాధారణ రోజుల్లో కాలేజీ, షూటింగుల వలన కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. కరోనా వల్ల ఇంటికి పరిమితం అవడంతో కుటుంబంతో ఎక్కువ సమయం గడిపా. వంట నేర్చుకున్నా. ఇప్పుడు చదువు, సినిమాలతో మళ్లీ బిజీ అయ్యాను.

*ఇటలీలో కార్నివాల్‌లో పాటలు చేశాం. ‘నువ్వే..నువ్వే’ సాంగ్ చాలా బాగా వచ్చింది!చాలా అద్భుతంగా దాన్ని చిత్రీకరించారు. ఇటలీలో మేము షూట్‌ చేసిన ప్రాంతాలన్నీ ఎంతో సుందరంగా ఉండేవి. ముఖ్యంగా కార్నివాల్‌ ప్రాంతం చాలా అద్భుతం.మేం చిత్రీకరణ చేసిన కొన్ని లొకేషన్లలో ఇప్పటి వరకూ తెలుగు చిత్రాలేవీ చేయలేదు. పాటలో ప్రతి నాలుగు స్టెప్స్‌కు లోకేషన్‌ మారుతూ ఉంటుంది. అది నిజంగా ఒక విజువల్‌ ట్రీట్‌లా ఉంటుంది.

*మా తాత లాయర్ అవ్వడంతో‌ చిన్నతనంలో ఆయన ఛాంబర్‌కు వెళ్తుండేదాన్ని.నా పదేళ్ల వయసులో తాతయ్య మరణించారు.అందుకే నాకు అటువైపు ఆసక్తి కలిగి నేను ‘క్రిమినల్‌ లా’ చదవాలనుకొన్నా.. నువ్వు లాయరు చదవాలనుకుంటే నీ డబ్బుతోనే చదువుకోమని మా నాన్న నాకు చెప్పారు. దీంతో కాల్‌సెంటర్లలో కూడా పనిచేసి డబ్బు సంపాదించేదాన్ని. ఆ తర్వాత కొన్ని యాడ్స్‌లో చేశాను. అలా సినిమాల్లోకి వచ్చాను.అటు లాయర్‌ వృత్తినీ, ఇటు నటనపై ఉన్న ఆసక్తినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాను.గత ఏడాది ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశా.లాయర్‌గా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాను.ఇప్పుడు మాస్టర్స్‌ చేయాలను కుంటున్నా.ఎల్‌ఎల్‌ఎమ్‌ కూడా పూర్తి చేస్తాను. భవిష్యత్తులో కచ్చితంగా క్రిమినల్‌ లాయర్‌ అవుతాను.

*నాకు భక్తి ఎక్కువే. జనవరి 1న శ్రీశైలంలోని మల్లన్న ను దర్శించుకున్నా. ముంబైలో ఉంటే… జుహూలోని శనీశ్వర దేవాలయానికి వెళ్తుంటా.వారంలో నాలుగు రోజులు ఉపవాసాలు ఉన్న రోజులున్నాయి. నేను మథురకి చెందిన బ్రాహ్మణ అమ్మాయిని! కుటుంబ నేపథ్యం వల్ల భక్తి భావనలు ఎక్కువ అనుకుంటాను. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకున్నా.

*నా తొలి సినిమా చూశాక లిప్‌ సింక్‌ సరిగా లేదని భావించా.రెండో చిత్రంలో ఆ తప్పు చేయకూడ దనుకొని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తెలుగు ట్యూటర్‌ను పెట్టుకున్నా.ఇందులో మహిమా పాత్రలో ఎలా నటించాలో చాలా స్పష్టంగా వివరిస్తు దర్శకుడు నా నుంచి నటనను రాబట్టుకున్నారు.ఈ సినిమాలో నా పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందని కచ్చితంగా చెప్పగలను. నా నిజజీవితానికి పూర్తి భిన్నమైన పాత్ర పోషిస్తున్నాను.ఈ పాత్ర ద్వారా ఎంతో పరిణతి చెందిన నటిగా గుర్తింపు లభిస్తుంది.ఇకపై రెగ్యులర్‌గా సినిమాలు చేస్తా. తెలుగులో అందరు స్టార్లతో నటించాలని ఉంది.తెలుగు చిత్రాలు చర్చలూ దశలో ఉన్నాయి. త్వరలో నిర్మాతలే వాటి వివరాలు వెల్లడిస్తారు.ఈ ఏడాది తమిళ తెరకు పరిచయం కాబోతున్నానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here