Multistarrer Visual Wonder…’RRR’ Movie Review

Cinemarangam.com
Review Rating. 3.5/5
బ్యానర్ : డి వి.వి.ఏంటర్ టైన్మెంట్స్
చిత్రం : “RRR”
నిర్మాత: డి వి.వి. దానయ్య
దర్శకత్వం– ఎస్‌ఎస్‌ రాజమౌళి
నటీనటులు– ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ తేజ్, ఆలియాభట్, అజయ్ దేవగణ్, శ్రేయ,హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రేస్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, సముద్రఖని,రాజీవ్‌ కనకాల తదితరులు
సంగీతం– యం యం కీరవాణి
కెమెరా– కె కె సెంథిల్‌ కుమార్‌
కథ– విజయేంధ్ర ప్రసాద్‌
మాటలు– బుర్రా సాయిమాధవ్‌
ఎడిటర్ : శ్రీకర్
పి.ఆర్.ఓ : వంశీ కాక
 

భార‌తదేశ స్వాతంత్య్ర స‌మ‌ర యోధులు కొమురం భీమ్‌, అల్లూరి సీతా రామరాజు జీవితాల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘‘RRR” (ర‌ణం రౌద్రం రుధిరం)’. హైదరాబాద్ తో పాటు  ప్రపంచంలోని ప‌లు ప్ర‌దేశాల్లో భారీ సెట్స్ వేసి చిత్రీక‌రించిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మ‌రో కాలానికి తీసుకెళుతుంది. జాతీయ స్థాయిలో అతి పెద్ద మ‌ల్టీస్టార‌ర్ మూవీగా యంగ్‌ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్‌చ‌ర‌ణ్, బాలీవుడ్ స్ఠార్స్ అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌,హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రేస్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడిలు న‌టిస్తున్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా లాక్‌డౌన్‌, టికెట్ రేట్ల సమస్యలు, వైరస్ బారిన పడడం, గాయాలవ్వడం వాయిదాల పర్వం ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కుని ఎట్టకేలకు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల ఉత్కంఠ కు తెరదించుతూ  ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25 న  ఎన్నో వేల స్క్రీన్లలో  ప్రేక్షకుల ముందుకొచ్చిన “RRR” (ర‌ణం రౌద్రం రుధిరం) చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.


కథ…..
స్వాతంత్రానికి పూర్వం 1920లో మనదేశం బ్రిటీష్ వాళ్లు పాలిస్తున్న రోజులవి. హైదరాబాద్‌ సంస్థానం నిజాం నవాబుల పరిపాలనలో ఉన్న తెలంగాణలోని ఓ గిరిజన ప్రాంతం అదిలాబాద్ జిల్లాలో “RRR”  కథ ప్రారంభం అవుతుంది. నిజాంను కలవడానికి వచ్చిన ఓ బ్రిటిష్ దొర (రే స్టీవెన్‌సన్‌), గోండు జాతికి చెందిన ఓ పచ్చబొట్లు పొడిచే మల్లి అనే చిన్న పిల్లను బ్రిటిష్ ఆఫీసర్ భార్య తమతోనే ఉంచుకుందామని బలవతంగా తీసుకువెళ్తుంది.ఇది అన్యాయమని ఎదిరించిన ఆ చిన్నారి కుటుంబాన్ని హింసిస్తారు.తన జాతి గౌరవం కోసం శ్వాసనైనా విడిచే  గోండు జాతికి కాపరి లాంటి కొమరం భీమ్ (ఎన్టీఆర్‌)కి ఈ విషయం తెలుస్తోంది.ఆ పాపను కాపాడటానికి భీమ్ డిల్లీ బయలుదేరతాడు.విశాఖపట్టణం సమీపానికి చెందిన రామరాజు (రామ్‌చరణ్‌) చిన్నతనం నుంచీ పోరాడే తత్వం ఉన్న రామరాజుకు పోలీస్ కావాలన్న ఆసక్తి. అందుకు తగ్గట్టుగానే పెరిగి పెద్దయ్యాక నాటి బ్రిటిష్ గవర్నమెంట్ లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. చాలా పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకుంటాడు.దాంతో కొమురం భీం ను ఎలాగైనా పట్టుకునే బాధ్యతను బ్రిటీష్ ప్రభుత్వం సీతారామరాజుకు అప్పగిస్తోంది.
భీమ్ ని పట్టుకొని గవర్నమెంట్‌కి అప్పగించే పనిలో డిల్లీ బయలుదేరతాడు.ఇదిలా ఉంటే డిల్లీలో ఓ సందర్భంలో ఇన్ స్పెక్టర్ రామ్, కొమరం భీమ్ కలుసుకుంటారు.కొమురం నిజాయితీ, మంచితనం నచ్చిన రామరాజు అతనికి సాయం చేస్తాడు.ముస్లిమ్ అని చెప్పుకునే  భీమ్, చలాకీగా ఉండే రామ్ ఇద్దరూ  బ్రిటిష్ జనాన్ని కలుసుకుంటూ ఉంటారు.వారిద్దరి మధ్య స్నేహం బలపడుతుంది కానీ, తమ అసలు లక్ష్యాలను చెప్పుకోరు. ఓ సందర్భంలో తమ డాన్స్ మాదిరి  మీ నాట్యం ఉండదు అని బ్రిటిష్ వాళ్ళు గేలి చేస్తారు. దాంతో ఈ ఇద్దరు మిత్రులు తమ ‘నాటు’ డాన్స్ తో రక్తి కట్టిస్తారు. ఇలా ఆనందంగా సాగుతున్న వారి స్నేహబంధానికి తెరపడుతూ తాను వెతికే బీమ్ ముస్లిమ్ లాగా కనిపించే స్నేహితుడు ఒక్కరే అని తెలిసిపోతుంది. బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎదిరించి గోండు జాతికి చెందిన మల్లిని భీం తీసుకువెళ్తుంటే రామ్ అడ్డుకొని బీమ్ ని బ్రిటీష్ ప్రభుత్వానికి అప్పగిస్తాడు. దాంతో బీమ్ ను చిత్రహింసలు గురి చేసి ఉరి శిక్ష విధిస్తారు. ఉరితీసే చివరి రోజు రామరాజు తన లక్ష్యాన్ని పక్కనపెట్టి స్నేహం కోసం బీమ్ ను తప్పిస్తాడు. బ్రిటీష్ గవర్నమెంట్‌ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు రామ్ ను చిత్రహింసలు గురి చేసి బ్రిటీషు ప్రభుత్వం మరణ శిక్ష విధిస్తుంది. బీమ్ ప్రాణాలు కాపాడి తన ప్రాణం మీదకు తెచ్చుకున్న రామరాజును కొమురం కాపాడుతాడా లేదా?.. వీరి స్నేహం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది?.. బ్రిటిష్ ప్రభుత్వంపై వీరు ఏ విధమైన పోరాటం చేశారు? చివరకు రామ్ తమ ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చాడా లేదా? గోండు జాతికి చెందిన మల్లిని వారి తల్లి తండ్రులకు బీమ్ అప్పగించాడా లేదా? అనేది తెలియాలంటే సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాల్సిందే..

నటీనటుల పనితీరు
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ లిద్దరూ ఎంట్రీ సీన్లలలో  పోటీపడి అద్భుతంగా నటించారు.మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భీమ్ పాత్రకి వంద శాతం న్యాయం చేశాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలలో తారక్ మరియు రామ్ చరణ్ నటించారని చెప్పడం కన్నా జీవించారని చెప్పవచ్చు. ఉక్రెయిన్ రాజభవనంలో తీసిన ‘నాటు నాటు’ పాటలో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన తీరు మహా అద్భుతం. ఇక బాలీవుడ్ స్టార్ అలియా భట్‌ సీత పాత్రలో ఒదిగిపోయింది. సీతగా నటించిన  పాత్ర నిడివి తక్కువే. కానీ, తెరపై కనిపించిన ప్రతిసారీ చక్కటి ఎమోషన్‌ పండిస్తూ అద్భుతంగా నటించింది. సీత పాత్రకు ఆమె అభినయం ప్లస్ అయ్యింది.ఒలీవియా మోరిస్ అందంగా కనిపించారు.అజయ్ దేవగణ్ పాత్ర నిడివి కూడా తక్కువే కానీ, సినిమాకి కీలకం. శ్రియ సరన్ చిన్న పాత్రలో మెరిసినా ఆకట్టుకుంది సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రావురమేష్, రాజీవ్‌ కనకాల తదితరులు తమతమ పాత్రల పరిధి మేర చక్కటి నటన ప్రదర్శించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
ఎలాంటి కథైనా తెరపై పండాలంటే దానికి కథనం చాలా గొప్పగా ఉండాలి. అలాంటి గొప్ప కథలను తెరకెక్కించడంలో  సిద్ధహస్తుడు రాజమౌళి. హిస్టరీలో ఎక్కడ కలుసుకోని ఇద్దరి చరిత్రకారుల అభూత కల్పనే  “RRR” (రౌధ్రం, రణం, రుధిరం), ఇద్దరు సూపర్ స్టార్లతో సినిమాలు తీయటం అంటే మాటలు కాదు..రాజమౌళి ఏ సినిమా తీసినా, దానిని జనం మెచ్చేలా వేరే లేవల్లో తీసుకువెళతాడనేది మరోసారి నిరూపించారు .అల్లూరి సీతారామరాజు, కొమురుం భీమ్‌ వంటి ఇద్దరు అమరవీరులు తాము నమ్మిన మంచి కోసం కలిసి పనిచేశారు అనే ఫిక్షనల్‌ సినిమాగా తెరపై అద్భుతంగా చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు.ఆయనకి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లాంటి మంచి నటులు కూడా తోడయ్యారు. వాళ్ల అభినయం సినిమాని మరో మెట్టు ఎక్కిస్తుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ఆద్యంతం హృదయాల్ని పిండేసేలా ఉంటాయి. మామూలుగానే కొన్ని సన్నివేశాలు తెరపై చూస్తోంటే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. నిప్పు, నీరు..అంటూ రెండు శక్తుల్ని పరిచయం చేస్తూ రామ్‌చరణ్‌ని అత్యంత సహజమైన లాఠీఛార్జ్ యాక్షన్ ఘట్టంతో పరిచయం చేసిన విధానం, అందులో ఆయన నటించిన తీరు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పులితో కలిసి చేసే విన్యాసాలతో సినిమాని ఆరంభించారు దర్శకుడు.అయితే ఆ ఇద్దరి మధ్య స్నేహం చిగురించినట్టుగానే, వైరం కూడా మొదలవు తుంది.రెండు శక్తులు ఒకదానికొకటి తలపడితే అది ఎంత భీకరంగా ఉంటుందో చూపిస్తూ రామరాజు, భీమ్ మధ్య సన్నివేశాల్ని తీర్చిదిద్దారు దర్శకుడు.
ఇంట్రవెల్ కు ముందు చోటు చేసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ చూపరులకు ‘గూస్ బంప్స్’ తెప్పిస్తాయి. ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి.  ముఖ్యంగా జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ కు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని వారి అభిమానులు ఎవరూ నిరాశ చెందకుండా ఉండేలా కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.సెంథిల్‌ అందించిన విజువల్ ట్రీట్‌ ఈ చిత్రం. కీరవాణి బాణీలు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే వున్నాయి. ఘనాపాటి బుర్రా సాయిమాధవ్‌ మాటల తూటాల్లా పేలాయి.శ్రీకర్ ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది.. ప్రముఖ నిర్మాణ సంస్థ  డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య నిర్మించిన నిర్మాణ విలువలు క్వాలిటీ గా..రిచ్ గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ఎన్నో రోజుల తరువాత ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మల్టీస్టారర్‌ విజువల్‌ వండర్‌ “RRR”  సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది.
       Cinemarangam.com   Review Rating. 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here