Our BA RAJU is always a super hit … Telugu Film Journalist Association

ఎవరు కనిపించినా మనస్ఫూర్తిగా నవ్వడం, హృదయపూర్వకంగా పలకరించడం, ప్రేమగా మాట్లాడటం మా రాజుగారి మనస్తత్వం. దానితో పాటు ఆయన బ్రెయిన్ లో అప్పటికి పీఆర్వోగా పని చేస్తున్న సినిమాల తాలూకు ప్రమోషన్ ప్లాన్స్ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. తాను చేస్తున్న పని మీద అపారమైన గౌరవం, పూర్తి పాజిటివ్ తత్త్వం ఆయన సొంతం. ఎందుకంటే… సినిమాయే ఆయన ప్రపంచం. సినిమాయే ఆయన లోకం. సినిమాయే సర్వస్వం. ఈలోగా ఎవరైనా వచ్చి కృష్ణ గారి ఫలానా సినిమా 100 రోజులు ఎన్ని సెంటర్స్ లో ఆడింది? ఎంత డబ్బు వసూలు చేసింది? సిల్వర్ జూబ్లీ సెంటర్లు ఎన్ని? అని అడిగితే… ఆ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ కీ ప్రెస్ చేసినట్టు కరెక్ట్ సమాచారం ప్రామాణికంగా తడుముకోకుండా రాజుగారు టకాటకా చెప్పేస్తారు తన  స్టోరేజ్ నుంచి. 

“మనకు అన్నం పెడుతున్న సినిమాకు మనం ఎంత చేయగలమో… అంతా చేయాలి” అని సహచరులతో అంటారెప్పుడూ. రాజుగారు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉండేవారు. సినిమా ప్రెస్ మీట్స్ కి వచ్చే జర్నలిస్ట్ మిత్రులను ఆయన చాలా బాగా చూసుకునేవారు. దాని ప్రభావం వాళ్ళు రాసే వార్తపైన ఉంటుందని అయన నమ్మేవారు. ఇక, ఆయన వార్తలను ఫాలో అప్ చేసే విధానం అసాధారణం. అది సాధ్యమైనంత తొందరగా ప్రింట్ లోనో, టీవీలోనో వచ్చేవరకు విశ్రమించేవారు కాదు. ఇలా ఏళ్ళ తరబడి చేసిన కృషి, ఆయన్ను విజయవంతమైన పీఆర్వోను చేసింది. అలాగని, ఆయన అనుబంధం సినిమాకు మాత్రమే పరిమితమయ్యేది కాదు. వ్యక్తిగతంగానూ ఉండేది. చిన్నా పెద్దా పాతా కొత్త జర్నలిస్టులను ఆప్యాయంగా పలకరించేవారు. తన అనుభవంతో జర్నలిస్టులను గైడ్ చేసేవారు. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో సలహాలు చెబుతూ ఉండేవారు. ఎవరికి అయినా అవసరం ఉందంటే వెంటనే స్పందించి సాయం అందేలా చూసేవారు. ఈ విషయంలో బీఏ రాజు – బి. జయ దంపతులను జర్నలిస్టులు ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు.

అమీర్‌పేట్‌లో దగ్గరలో ఎల్లారెడ్డిగూడలో ‘సూపర్ హిట్’ ఆఫీస్ ఉండేది. పదిహేనో, పాతికో మించని మొత్తం ఫిలిం జర్నలిస్టుల్లో ఆ ఆఫీసులో నలుగురు, ఐదుగురు జర్నలిస్టులు ఉండేవారు. సినిమాకు సంబంధించి రాసేవారు ఎవరైనా అక్కడికి రావచ్చు. ఉండొచ్చు. భోజనం చేయవచ్చు. ఐటమ్స్ రాసుకోవచ్చు. ఎవరికైనా పని లేదంటే… రాజుగారి నోటి నుంచి ఎప్పుడూ ఒకే మాట వచ్చేది. ‘మన ఆఫీసులో ఉండండి’. అవసరంలో ఆసరాగా ఉన్నారని కృతజ్ఞతలు గట్రా ఆయన కోరుకునేవారు కాదు. ‘ఎక్కడైనా మంచి ఉద్యోగం వస్తే వెళ్లిపోవచ్చు’ అని చెప్పేవారు. అలా ఆయన సాయం అందుకున్నవారు ఎందరో ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ తరంలో ఎందరో ఫిల్మ్  జర్నలిస్టులకు రాజుగారు నిజంగా ఓ పాఠశాల. అయన మార్గదర్శకుడు. స్ఫూర్తిగీతం.

ఇన్నేళ్ళలో ఆయన్ను మొదటి నుంచీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది – ఆయన ఎంత సాధించినా… నాటి నుంచి నేటి వరకు ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని, ఆయన ప్రవర్తన మారలేదని, ఎదుటి వ్యక్తిని గౌరవించడంలో ఏ తేడాలు లేవని. పని విషయంలో పాటించే  నియమాల్లో ఏ మార్పు లేదని. 

సూపర్ స్టార్ కృష్ణగారి వీరాభిమానిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, కృష్ణగారికి దగ్గరై, కృష్ణగారి సలహాతో సీనియర్ జర్నలిస్ట్ మోహన్ కుమార్ గారి ద్వారా ఫిలిం జర్నలిస్ట్ అయి 1500లకు పైగా సినిమాలకు పీఆర్వోగా పనిచేసిన జీవితం రాజు గారిది. తనకంటూ ఎలాంటి నేపధ్యం లేకపోయినా… కృష్ణగారి ప్రోత్సాహంతో సినిమా పరిశ్రమకు వచ్చి పాత్రికేయుడిగా కెరీర్ ప్రారంభించి పీఆర్వోగా ఎంతో అనుభవం సంపాదించారు. సూపర్ హిట్ పేరుతో మ్యాగజైన్ ప్రారంభించి, పరిశ్రమలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. జర్నలిస్ట్ గా విశేషంగా కాంట్రిబ్యూట్ చేశారు. తన జీవన సహచరి జయగారితో సినిమాలు తీశారు. దశాబ్దాల అనుభవంతో తన జీవితాన్ని సూపర్ హిట్ గా మలుచుకున్నారు. 

చిరునవ్వు ఏమైనా సాధిస్తుందని చెప్పడానికి రాజుగారు ఓ ఉదాహరణ. ఓ మంచి మనసు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తుందని అనడానికి రాజుగారే ఓ రుజువు. నిజాయితీగా కష్టపడే తత్త్వం ఎలాంటి  హృదయాన్ని అయినా గెలుస్తుందని చెప్పడానికి రాజుగారు ఓ ప్రమాణం.


ఇట్లు,
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here