Prepare to give a double bedroom house to Kandikonda family..Anil Kumar Vallabhaneni

అనారోగ్యంతో కన్నుమూసిన సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని. తనకు విషయం తెలిసి చాలా బాధ పడుతున్నానని ఆయన అన్నారు. ముందు కందికొండ యాదగిరి చిత్రపురి కాలనీలో నాలుగు లక్షల రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారని, అనారోగ్యం పాలైన తర్వాత ఆ సభ్యత్వాన్ని రద్దు చేసుకుని నాలుగు లక్షలు వెనక్కి తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఆయన అనారోగ్యం పాలైన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఏదైనా సహాయం చేయాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. అందులో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారి సమక్షంలో కందికొండ కుటుంబానికి 20 లక్షల రూపాయలు విలువ చేసే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొని అందజేయడం జరిగిందని అన్నారు. అయితే కొద్ది రోజులు గడిచిన తరువాత తండ్రి అనారోగ్యం దృష్ట్యా సింగిల్ బెడ్ రూమ్ తమకు సరిపోవడం లేదని కందికొండ కుమార్తె తమ దృష్టికి తీసుకురావడంతో అది మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి దృష్టికి తీసుకువెళ్లానని అనిల్ కుమార్ పేర్కొన్నారు.  మంత్రివర్యులు కూడా ఆ విషయం మీద సానుకూలంగా స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడానికి అంగీకరించారని వారి కుమార్తెను సమయం చూసుకుని వస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. కందికొండ కుటుంబానికి ముందు సింగిల్ బెడ్ రూమ్ ఇచ్చామని డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యామని ఇంకా ఏదైనా సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనిల్ కుమార్ పేర్కొన్నారు. అయితే కొందరు కావాలని ఈ విషయం మీద దుష్ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అలా చేయడం సరికాదని అన్నారు. కందికొండ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఫ్లాట్ ఇవ్వడానికి ఏ సమయంలో అయినా సిద్ధంగానే ఉన్నామని ఈ సందర్భంగా అనిల్ చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here