Senior Acter Satyaprakash interview about ‘Ullala Ullala’

సీనియర్ నటుడు సత్యప్రకాష్ గారి దర్శకత్వంలో వారి అబ్బాయి నటరాజ్ ని హీరోగా పరిచయం చేస్తూ లవర్స్ డే ఫేమ్ ఎ.గురురాజ్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం “ఊల్లాల ఊల్లాల”. సుఖీభవ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు దర్శకుడు సత్యప్రకాష్ మీడియా తో తెలుపుతూ ” నేను అసలు దర్శకుడు అవుదామనే పరిశ్రమకి వచ్చాను కానీ ఆ పైవాడి నిర్ణయంతో నటుడ్ని అయ్యాను. నటుడు అయిన ప్రతీవాడికి హీరో అవుదామని ఆలోచన, అభిరుచి, అభిలాష ఉంటుంది కానీ ఆ దేవుడి లెక్కలు వేరేలా ఉంటాయి. అందులో భాగంగానే ఏమో క్రూరుడైన విలన్ పాత్రలే అన్ని భాషల్లో దొరికాయి, అలా చాలా మందికి నా పేరు సత్య ప్రకాష్ అని తెలీదు. భోజ్ పూరి లో తివారి బాబా అని, కర్ణాటకలో యాసిడ్ రాజా అని, కొత్వాల్ అని రకరకాల పేర్లతో పిలిచేవాళ్ల ప్రేమని పొందాను దానికి చాలా సంతోషంగా ఉంది” అన్నారు. అలాగే పాత్రికేయులు అడిగే ప్రశ్నలకి సమాధానమిస్తూ…

మొదటి సారి దర్శకత్వం చేశారు కష్టంగా అనిపించిందా?

నిర్మాత ఇచ్చిన సమయంలో, ఇచ్చిన బడ్జెట్ లో పని పూర్తి చేసి విడుదలకి సిద్ధం చేయడం తెరవెనుక ఎన్నో సార్లు చూసినా నేనే మొదటి సారి చేయడం వల్ల కొంచం కష్టంగానే అనిపించింది. అలాగే తండ్రిగా, నటుడిగా నేను మా అబ్బాయి నటరాజ్ కి హీరోగా అవ్వడానికి కావాల్సిన ఫైట్స్, డాన్స్, బాడీ బిల్డింగ్, జిమ్నాస్టిక్స్ వంటివి 2 ఏళ్ళు శిక్షణ తీసుకునేలా చేసాను, మా అబ్బాయిని కన్నడలో రాక్ లైన్ వెంకటేష్ గారు పరిచయం చేశారు. అదే సమయంలో గురురాజ్ గారితో ‘ఊల్లాల ఊల్లాల’ తీద్దాం అనుకోవడం ఆయనకి మా అబ్బాయి నటనని చూపించడం ఆయన ఒప్పుకోవడం కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.

“ఊల్లాల ఊల్లాల” కథ ఏంటి?

ఒక ప్రేమ కథగా మొదలయ్యి చాలా ఎంటర్టైనింగ్ గా థ్రిల్లింగ్ గా సాగుతుంది, తరువాత ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ చివరి వరకు ఉంటుంది.

నిర్మాత గురురాజ్ గారు ఈ చిత్రంలో పాత్ర చేయడానికి కారణం మీరేనా?

ఆయనకి సినిమాల పైన ఉన్న ఇష్టం తో ఇదివరకు కూడా చాలా చిత్రాలు చేసారు కానీ ఈ చిత్రంలోని పాత్రకి ఆయన సరిగ్గా సరిపోతారు అనిపించి గెటప్ వేయించాం, అనుకున్న దానికంటే బాగా చేశారాయన.

మీరు ఈ చిత్రంలో ఏ పాత్ర చేయలేదా?

నేను చేశాను, కానీ సినిమా కథాంశం చెప్పే చిన్న పాత్ర అది.

మీ అబ్బాయి తెలుగు మాట్లాడుతారా?

చాల బాగా మాట్లాడుతాడు. ఈ చిత్రంలో అతనే దుబ్బింగ్ చెప్పాడు, ఇంతకముందు చేసిన కన్నడ సినిమా లో కూడా తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు.

చిత్రం అనుకున్న బడ్జెట్ లో చేసారా? బడ్జెట్ ఎంత అయింది?

నిర్మాత మాకు బడ్జెట్ చాలా సౌకర్యంగా ఉండేలా ఇచ్చారు, అనుకున్నట్టుగానే ప్రమోషన్ ఖర్చుతో కలిపి 4cr లోపలే 34 రోజుల్లో హైదరాబాద్ లోపల మరియు చుట్టుపక్కల్లోనే చేసేశాం.

మీరు దర్శకుడు కావాలి అని వచ్చారు కానీ పరిశ్రమకి నటుడిగా ఎలా పరిచయమయ్యారు?

దర్శకుడు అవుదామనే నిర్మాత రవి రాజా పినిశెట్టి గారి దగ్గరికి వస్తే విలన్ పాత్ర చేయమని చెప్పారు. అలాగే మలయాళం దర్శకుడు ప్రియదర్శన్ కూడా మోహన్ లాల్ గారి అభిమన్యు చిత్రంలో పాత్ర ఇచ్చారు. ఆ తరువాత విజయ్ బాపినీడు గారి దగ్గర పని చేస్తుండగా చిరంజీవి గారితో బిగ్ బాస్ చిత్రంలో చేయమన్నారు. అప్పటి నా పరిస్థితులకి సంపాదన, పేరు ముఖ్యం అనిపించి అలా వరుసపెట్టి వచ్చిన ఒకే రకం పాత్రలే చేసాను. తెలుగువాడిని అయినా ఇప్పటికి చాలా మంది నన్ను కన్నడ వాడు అనుకుంటారు.

మీరు ఎక్కువ చిత్రాలు ఈ భాషలో చేశారు?
కన్నడ, తరువాత తెలుగు ఆ తరువాత భోజపురి అలా చాలా భాషల్లో భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న ముఖ్య విలన్ గా చేసాను. ఈ మధ్య కొంచం తగ్గించినా, మళ్లీ మునుపటిలాగే ఎక్కువ చిత్రాలు చేస్తాను.

మీ తరువాతి చిత్రమేంటి ?

ఒక పెద్ద బ్యానర్ లో పెద్ద హీరయిన్ తో థ్రిల్లర్ చిత్రం లో ముఖ్య పాత్ర చేస్తున్నాను.

ఎందుకని ఎక్కువ థ్రిల్లర్ చిత్రాలు ??

నాకిప్పుడున్న మనస్థితికి ఇలాంటి చిత్రాలే చేయగలనేమో, నాదగ్గర 14 స్క్రిప్టులు సిద్ధంగా వున్నాయి, నేను ప్రేమ కథ చేస్తాను అంటే ఈ వయసులో ఈయనకి ఇలాంటి చిత్రాలు అవసరమా అని అనుకుంటారు అది కూడా ఒక కారణమేనేమో.

“ఊల్లాల ఊల్లాల” కథకి స్ఫూర్తి ఏంటి ??

ఏదో ఒక వైవిధ్యమైన జోనర్ లో చిత్రం చేయాలి కామెడీ ,థ్రిల్లర్ , యాక్షన్ ఇలా అన్ని ఉండాలి అన్న ఆలోచననుండి కథ పుట్టింది ఆ తరువాత అవసరం కొద్దీ సన్నివేశాలు, కమర్సియల్ ఎలిమెంట్స్ జత చేయాల్సి వచ్చింది.

ఈ చిత్రం కన్నడలో కూడా చేస్తున్నారా?

రాక్ లైన్ వెంకటేష్ గారిని అడగటం జరిగింది ఆయన చెప్తా అన్నారు. కుదిరితే జనవరి 1న తెలుగు తో పాటు కన్నడలో విడుదల చేస్తారు లేదంటే మంచి సమయం చూసుకొని తరువాత విడుదల చేస్తాం.

మీరు చాల పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేసారు ఎవరైనా టిప్స్ ఇచ్చారా?

90ml డైరెక్టర్ శేఖర్ రెడ్డి, వై.వ్.స్ చౌదరి, పూరి జగన్నాథ్ గారు వీళ్ళందరూ చాలా సలహాలు చెప్పారు అవి నాకు చాలా సహాయపడ్డాయి. అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసినపుడు పూరి గారు, నువ్వు చాల సక్సెసఫుల్ డైరెక్టర్ అవుతావు అని మెచ్చుకున్నారు. అలాగే మా ప్రొడ్యూసర్ గురురాజ్ గారు కేవలం నిర్మాత గానే కాక అన్ని విధాలుగా సహాయపడ్డారు. అయన రియల్ ఎస్టేట్ లో బిజీగా ఉన్నా, బిజినెస్ పక్కన పెట్టి మరీ చాలా సపోర్టివ్ గా ఉన్నారు.

మీ రెమ్యూనరేషన్ ఎక్కువ లేదా హీరో హీరోయిన్ రెమ్యూనరేషన్ ఎక్కువా?

మగవాళ్ళ జీతం, ఆడవాళ్లు వయసు అడక్కూడదు, చెప్పకూడదు ఇది మీకు తెలిసిందే కదా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here