‘Ullalla Ullalla’ Heroine Ankitha Interview

సరికొత్త కథ, కథనాలతో సీనియర్ నటుడు సత్యప్రకాష్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న కేజ్రీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఊల్లాల ఊల్లాల’. ‘లవర్స్ డే ‘ చిత్ర నిర్మాతగా అందరికి తెలిసిన ఎ.గురురాజ్ సుఖీభవ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో సత్య ప్రకాష తనయుడు నటరాజ్ ని హీరోగా, లవర్స్ డే ఫేమ్ నూరిన్ ని హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేస్తుండగా మిస్ బెంగుళూరు గా అందరికీ తెలిసిన అంకిత ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తుంది. అదే సమయంలో సింగర్లుగా అందరికీ తెలిసిన మంగ్లీ మరియు రోల్ రైడ లని నటులుగా పరిచయం చేస్తూ ఊల్లాల ఊల్లాల జనవరి 1 న విడుదలకి సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా హీరోయిన్ అంకిత ఈ చిత్ర కథ, తన పాత్ర మరియు రాబోయే తన చిత్రాల గురించి విలేకర్లతో మాట్లాడింది.
మీరు మిస్ బెంగుళూరు 2016 అయ్యాక కన్నడలో ఎన్ని చిత్రాలు చేశారు?
కన్నడ చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి కానీ కన్నడ పరిశ్రమలో కర్ణాటక అమ్మాయిలకు మాత్రమే ఎక్కువ అవకాశాలిస్తారు, నేను కూడా ఎప్పటినుండో ఇక్కడే చేయాలని అనుకోవడం ఈ లోపలే నాకు తెలుగు పరిశ్రమ నుండి అవకాశం రావడం వెంటనే చేసేయడం జరిగిపోయింది.ఇది మీ రెండవ చిత్రమా? దీని తరువాత ఇంకేవైనా చిత్రాలు చేస్తున్నారా?
అవును ఇది తెలుగులో నా రెండవ చిత్రం, దీని తరువాత ‘నా బంగారు తల్లి’ దర్శకుడు రాజేష్ టచ్రివర్ దర్శకత్వంలో తెలుగు-ఒడియా ద్విభాషా చిత్రం చేస్తున్నాను, అది వచ్చే సంవత్సరంలో విడుదల కానుంది.ఈ చిత్రంలో మీ రోల్ ఎలా ఉంటుంది?
కొత్త నటులు డైరక్టర్లని ఎక్కువగా అడగడానికి తెలుసుకోవడానికి స్కోప్ ఉండదని మీకు తెలిసిందే. దర్శకుడు సత్య ప్రకాష్ గారు నాకు ఈ చిత్ర కథలో నా పాత్ర మేరకు కొన్ని సన్నివేశాలు చెప్పారు, అందులో నా రోల్ కి ఉన్న ప్రాముఖ్యతని చూసి, దేవుడి పై భారం వేసి ఒప్పుకున్నాను. నాకు పూర్తి కథ ఇప్పటివరకు తెలీదు, చిత్రం కూడా చూడలేదు, నాకు తెలిసినంతవరకూ చాలా రిచ్ గా సస్పెన్స్ తో నిండిన వైవిధ్యమైన పాత్ర నాది.నటరాజ్ తో రొమాంటిక్ సీన్స్ లో చేయడం ఎలా అనిపించింది?
మిగితా సీన్ల లాగే రొమాంటిక్ సీన్లలో నటించడంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. నేను హీరోయిన్ కావాలని అనుకున్నపుడు ఇలాంటి సీన్లలో నటించాల్సి వస్తుందని తెలిసే నిర్ణయించుకున్నాను. అప్పట్లో మాధురి దీక్షిత్ నుండి ఇప్పటి కంగనా రనౌత్ వంటి పెద్ద పెద్ద హీరోయిన్లు అందరూ తమ కెరీర్ లో ఇలాంటివి చేసుంటారు. అంత మంది చిత్ర బృందం మధ్య రొమాన్స్ ని నటనకి మాత్రమే పరిమితం చేసి బాగా నటించాలని మాత్రమే అనుకుని చేస్తుంటాం కాబట్టి అందులో మాకెలాంటి సమస్య ఉండదు.

సీనియర్ నటుడు, దర్శకుడు సత్యప్రకాష్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
ఆయన చాలా మంచి వారు నన్ను అందరికంటే ఎక్కువ సపోర్ట్ చేశారు. ఒక డైరక్టర్ లాగా కాకుండా కూతురిలా చూసుకునేవారు, నువ్వు ఒక పెద్ద స్టార్ అవుతావు అని చెపుతూ నన్ను అలానే ట్రీట్ చేసేవారు.

తెలుగు పరిశ్రమలో మళ్ళీ పనిచేయడం ఎలా అనిపించింది?
వీలైతే తెలుగు పరిశ్రమలో మరో 20 ఏళ్ళవరకైనా కొనసాగాలనుంది ఎందుకంటే ఇక్కడ భాషా, ప్రాంతం అని తేడా చూపించకుండా కేవలం ప్రతిభని చూసి గుర్తింపు, అవకాశాలు, మర్యాద ఇస్తారు. నేను బెంగళూర్ అమ్మాయిని అని తెలిసినా భాష రాకపోయినా నా ప్రతిభని చూపించడానికి ఒక అవకాశమిచ్చారు. అలాగే సత్య ప్రకాష్ గారు ఎక్కడికి వెళ్లినా మీ అమ్మని వెంట తీసుకెళ్ళు, ఇక ముందు చిత్రాల్లో అయినా సరే తనని నీతోనే ఉండనివ్వు అని చాలా ఆత్మీయతతో జాగ్రత్తలు చెప్పి సలహాలు ఇచ్ఛేవారు అంత మంచి మనుషులున్నారు కాబట్టే ఈ పరిశ్రమలో కొనసాగాలనుంది.

ఈ చిత్రంలో మీరు ఎన్ని పాటల్లో కనిపిస్తారు?
ఒక్క పాటలో పూర్తిగా కనిపిస్తాను డాన్స్ చేస్తాను, మిగితా రెండు పాటల్లో అక్కడక్కడా కనిపిస్తుంటాను.

2020 జనవరి మొదటి రోజునే మీ ఊల్లాల ఊల్లాల చిత్రం విడుదలవ్వడం ఎలా అనిపిస్తుంది?
చాలా సంతోషంగా ఉంది కానీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో, నా నటనకి ఎన్ని మార్కులు వేస్తారో లాంటి వేరు వేరు ఆలోచనలు కూడా ఉన్నాయి.

వచ్చే సంవత్సరంలో మీరేవైనా చిత్రాలు సంతకం చేశారా?
ప్రస్తుతానికి రామ్ గోపాల్ వర్మ గారు నాకు రెండు చిత్రాలు ఆఫర్ చేశారు అవి వచ్చే సంవత్సరంలో తెరకెక్కవచ్చు.

రామ్ గోపాల్ వర్మ చిత్రంలో నటించడానికి పిలుపొచ్చినపుడు ఎలా అనిపించింది?
అంత పెద్ద దర్శకుడు ఆయన చిత్రాల్లో అవకాశం ఇస్తున్నందుకు చాలా ఆనందంగా అనిపించింది, ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని చాలా సంతోషంగా ఎదురుచూస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here