Versatile Hero Sathyadev Afghan lyrics in Bollywood movie ‘Habib’ songs

బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, ఉమ‌మ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య‌, తిమ్మ‌రుసు వంటి చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి న‌టుడిగా, హీరోగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ ఇప్పుడు ‘హ‌బీబ్‌’ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా నుంచి స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఓ ఎమోష‌న‌ల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ ఆదివారం రోజున విడుద‌ల చేసింది. ఈ పాట అఫ్‌ఘ‌న్ సాహిత్యంతో ఉండ‌టం విశేషం. ఇండియా, అఫ్ఘ‌నిస్థాన్ ప్ర‌జ‌లంద‌రికీ ఈ పాట‌ను అంకితం చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ‘‘కొంత మంది చిన్న‌పిల్ల‌ల‌ను ఇండియా నుంచి నుంచి స‌రిహ‌ద్దు దాటించి పాకిస్థాన్ తీసుకెళ్లి ఉగ్ర‌వాద చ‌ర్య‌లు చేయ‌డానికి శిక్ష‌ణ ఇప్పిస్తుంటారు. పలు ఉగ్రవాద చర్యలను చేయడానికి పాకిస్థాన్ నుంచి ఆ పిల్ల‌ల‌ను అఫ్ఘ‌నిస్థాన్‌కు పంపుతారు.అలా త‌న ఉగ్ర‌వాదుల చేతుల్లో చిక్కుకున్న త‌న కొడుకుని వెతుక్కుంటూ అఫ్ఘనిస్థాన్‌కు వెళ్లే ఇండియ‌న్ ఆర్మీ ఆఫ‌స‌ర్ క‌థే ‘హ‌బీబ్‌’. 
చివరకు ఆఫ్ఘ‌నిస్థాన్ సైన్యం, మ‌రికొంత మంది అక్క‌డి సాధార‌ణ ప్ర‌జ‌ల స‌హ‌కారంతో ఆర్మీ ఆఫీస‌ర్ త‌న కొడుకుతో పాటు అక్క‌డున్న ఇత‌ర పిల్ల‌ల‌ ఆచూకీని క‌నిపెడ‌తాడు. ఆ ఉగ్ర చెర నుంచి ఆ పిల్ల‌ల ప్రాణాల‌ను కాపాడ‌ట‌మే కాదు.. వారికి స్వేచ్ఛ‌ను క‌లిగిస్తాడు మ‌న ఆర్మీ ఆఫీస‌ర్‌’’ అని నిర్మాతలన్నారు.
ఈ చిత్రాన్ని జెన్నీఫ‌ర్ అల్ఫోన్స్ తెర‌కెక్కిస్తున్నారు. స‌త్య‌దేవ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. హ‌బీబ్ స‌ఫీ, కోటి రావ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ‌య‌ఫ‌ణి కృష్ణ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
‘‘నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. తీవ్ర‌వాదం చిన్న‌పిల్ల‌ల‌తో అంద‌రినీ ల‌క్ష్యంగా చేసుకుని ప‌నిచేస్తుంది. ఇలాంటి తీవ్ర‌వాద సంస్థ‌ల కార‌ణంగా చిన్న‌పిల్ల‌ల బాల్యం దోపిడీకి గుర‌వుతుంది. అలాంటి నీచ‌మైన ప‌నిని అంతం చేయించాల‌నే ఉద్దేశంతో నిజాయ‌తీగా నేను చేస్తున్న చిన్న ప్ర‌య‌త్న‌మిది. దీన్ని ఈ ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రూ ఓ బాధ్య‌త‌గా తీసుకుని ముంద‌డుగు వేయాలి’’ అని దర్శకురాలు జెన్నీఫ‌ర్ అల్ఫోన్స్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here