తెలుగు సినీ పరిశ్రమ మొత్తం మీద ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా గుర్తు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు సినీ పరిశ్రమ మొత్తానికి పెద్ద దిక్కుగా మారారు. తనకు ఆ “పెద్ద” అనే బాధ్యతలు వద్దు అంటూనే సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా తానున్నాను తన భుజం కాస్తాను అంటూ ఆయన అన్ని విషయాల్లోనూ అండగా ఉంటూ వస్తున్నారు. మెగాస్టార్ కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ తన చరిష్మాతో తెలుగు సినీ పరిశ్రమని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే ఎంతోమందికి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. సినీ పరిశ్రమలో సైతం ఎంతోమంది నటీనటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని సినీ పరిశ్రమకు వచ్చారంటే అతిశయోక్తి కాదు. సామాన్య ప్రేక్షకులకు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, చిరంజీవి పేరు చెబితే దేనికైనా రెడీ అనే అభిమాన గణాన్ని ఆయన సంపాదించుకున్నారు చిరంజీవి.
తాజాగా 24 మంది సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను ఆవిష్కరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ శుక్రవారం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జర్నలిస్టు ప్రభు జన్మదిన వేడుకలను నిర్వహించారు. కుటుంబసభ్యులు, చిరంజీవితో కలిసి జర్నలిస్టు ప్రభు కేక్ కట్ చేసి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత మెగాస్టార్ చేతులు మీదుగా “శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు” పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాసరి నారాయణరావు, కృష్ణ, కృష్ణంరాజు, విజయనిర్మల, వడ్డే రమేశ్, కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ వంటి వారి జీవిత చరిత్రలను జర్నలిస్ట్ ప్రభు ఈ పుస్తకంలో ఆవిష్కరించారు.
మెగాస్టార్ చేతుల మీదుగా ఆవిష్కరించిన తొలికాపీకి వేలంపాట నిర్వహించగా.. రవి పనస రూ.4 లక్షలకు ఆ పుస్తకాన్ని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, గిరిబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, శివాజీ రాజా, రేలంగి నరసింహారావు, డైరెక్టర్ పీఎన్ రామచంద్రారావు, సీనియర్ యాక్టర్ హేమచందర్, ఉత్తేజ్, దాసరి అరుణ్ కుమార్, సినిక్స్ గ్రూప్ అధినేత చుక్కపల్లి రమేశ్ తో పాటు.. ఇతర పాత్రికేయులు పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. “ఈరోజు ఇలా నా కుటుంబాన్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు సినిమా జర్నలిజంలో ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. ఎప్పుడూ తెలుగు సినిమా జర్నలిజం విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. ఆ విషయంలో మాత్రం జర్నలిస్టులు అందరికీ హ్యాట్సాఫ్ చెప్పాలి. “శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు” అనే హెడ్డింగ్‌తో పుస్తకం రావడం అనేది ఇప్పుడు అవసరం. మా ఇంట్లోనే నా మనవళ్లు, మనవరాళ్లు ఎప్పుడూ రామ్ చరణ్, బన్నీ, తేజ్, వైష్ణవ్ వీళ్లే హీరోలు అన్నట్లు.. వాళ్ల పాటలే పెట్టమంటూ ఉంటారు. సరదాగా నాకు ఎక్కడో కడుపు మండిపోతూ ఉంటుంది. మనకి ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి. అవి అడగరు ఎందుకు అనుకుంటూ ఉంటాను. నేను ఎవరినో, ఏమిటో చెప్పుకోవాల్సిన పరిస్థితి నాకే ఏర్పడింది. ఓరోజు నా బెస్ట్ నంబర్స్ మొత్తం చూపించాను. ఇప్పుడు వాళ్లు “గాడ్ ఫాదర్” మూవీ నాలుగుసార్లు చూశారు. అలా మన ఇండస్ట్రీలో ఉన్న గొప్పవాళ్ల గురించి ఇప్పటి జనరేషన్‌కి తెలిసేలా ఓ పుస్తకం రాయాలని ప్రభు పూనుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అంటూ మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు.
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గురించి రాసిన ఒక ఆర్టికల్‌కి ఆయన అభినందిస్తూ తిరిగి ఉత్తరం రాసిన విషయాన్ని వెల్లడించారు. ఆ ఉత్తరం కారణంగా ఆయన జర్నలిజంలో ఎలా ముందుకు సాగారో చెప్పుకొచ్చారు. తాను ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం మెగాస్టార్ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమం అనంతరం మెగాస్టార్ చిరంజీవితో ఫోటోలు దిగేందుకు సెలబ్రిటీల భార్యలు సైతం ఆసక్తి చూపించడం చర్చనీయాంశమైంది. వారంతా సినీ పరిశ్రమలో దర్శకులు, నిర్మాతలు అలాగే పలువురు ఉన్నతాధికారుల భార్యలు. అయితేనేమి మెగాస్టార్ చిరంజీవి అభిమానులే. మెగాస్టార్ చిరంజీవి హాజరైన కార్యక్రమానికి తమ హాజరవుతున్నామని ఆనందంతో వచ్చిన వారందరికీ ఆయనతో ఫోటో దిగే అవకాశం వస్తే వదులుకుంటారా? వెంటనే వెళ్లి ఆయనతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. మెగాస్టార్ చిరంజీవి ఎవరిని నొప్పించరు అనే విషయం మనందరికీ తెలుసు. దీంతో ఆయన కూడా ఫోటోలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే కొద్ది రోజుల క్రితం ఇలానే తన అభిమానులకు ఫోటోలు ఇస్తుంటే గరికపాటి చేసిన కామెంట్లను గుర్తు చేసుకుంటూ ఆయన ఇక్కడ లేరు కదా అంటూ చిరు చలోక్తి విసిరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ సందడి నెలకొంది. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలై బలై కార్యక్రమంలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది అక్కడికి సామాన్యులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు వారి భార్యలు విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే వారందరూ మెగాస్టార్ చిరంజీవితో ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నిస్తే గరికపాటి నోరు జారి అభాసు పాలయ్యారు. మెగాస్టార్ వ్యక్తిత్వం ఏమిటో అప్పుడే బయట పడడంతో అందరూ మెగాస్టార్ అంటే ఇది అంటూ కొనియాడారు.









