Director Achhana Srinivasayadav interview about Commercial action backdrop Movie ‘Settlement’

అచ్చన శ్రీనివాసయాదవ్‌… ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘చిలక్కొట్టుడు’తో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి ఆ తర్వాత 13 సినిమాలకు వివిధ దర్శకుల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌, కో`డైరెక్టర్‌గా పనిచేసి, ‘ఫ్రెండ్స్‌ కాలనీ’తో దర్శకుడిగా మారారు. కొద్ది కాలంగా సినిమాలను పక్కన పెట్టి బుల్లితెరపై సీరియల్స్‌కు క్రియేటివ్‌ హెడ్‌గా, కొన్ని పాపులర్‌ బ్రాండ్‌లకు యాడ్‌ఫిల్మ్‌ మేకర్‌గా పని చేశారు. తాజాగా ‘సెటిల్‌మెంట్‌’ పేరుతో పూర్తి, కమర్షియల్‌ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా ‘సింహాసనం’ ప్రతినిధితో కొద్దిసేపు ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే…

ఈ మధ్య సినిమాకు దూరమైనట్టున్నారు?
మీరన్నది నిజమే. సినిమాలకు కొద్ది కాలంగా దూరంగా ఉన్నాను. కానీ కళామతల్లికి దూరం కాలేదు. కొన్ని సంవత్సరాలుగా టీవీ సీరియల్స్‌, ప్రముఖ బ్రాండ్‌ల కోసం యాడ్‌ ఫిల్మ్‌లు తీస్తున్నాను.

టీవీ సీరియల్స్‌ అంటే చేతినిండా పని కదా. వాటిని వదిలి మళ్లీ సినిమాల వైపుకు ఎందుకు వస్తున్నారు?
నేను బేసిక్‌గా కళాకారుణ్ణి. మాకు సినిమాలు, టీవీలు, యాడ్స్‌, ఇంకోటి, ఇంకోటి అంటూ ఉండవు. ఎక్కడైనా నేను చేసే పని ఒకటి. కాకపోతే ఆ ప్లాట్‌ఫాంను బట్టి వ్యూవ ర్షిప్‌ ఉంటుంది. మీరన్నట్టు ఇప్పుడు టీవీ సీరియల్స్‌ మంచి రైజ్‌లో ఉన్నాయి. కానీ అక్కడ ఉండే రాజకీయాలో మన దేశం మొత్తం మీదా భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. ఆక్కడ అసలు పనికన్నా.. ఎదుటివాడి కుర్చీ లాగే కార్య క్రమాలకే పెద్ద పీఠ. ఆ కుర్చీలాటలో నేను ఇమడలేను. అందుకే సీరియల్స్‌కు దూరంగా జరిగి యాడ్స్‌ చేస్తున్నాను. టెలీ ఫిలింస్‌ కొన్ని, ఓటీటీ ప్లాట్‌ఫాంలో పని చేశాను.

మళ్లీ మెగాఫోన్‌ పట్టి ‘సెటిల్‌మెంట్‌’ అంటున్నారు? పైగా ‘ఎ జర్నలిస్ట్‌ జర్నీ’ అని జర్నలిస్ట్‌లనే టార్గెట్‌ చేశారు?
ఒక జర్నలిస్ట్‌ జీవితం నేపథ్యంలో సాగే కథ ఇది. వారిని నెగెటివ్‌గా చూపించట్లేదు. వారిపట్ల నాకూ గౌరవమే. నా కెరీర్‌ కూడా జర్నలిస్టుగానే మొదలైంది. నిజమైన జర్నలిజానికి కట్టుబడిన జర్నలిస్ట్‌ పెన్ను గన్ను కన్నా ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో చూపించబోతున్నాను.

ప్రొడ్యూసర్‌, హీరో, ఇతర టెక్నీషియన్స్‌ వివరాలు?
ఈ సినిమాని ఎస్‌.వి.ఎస్‌. ఫిలిం ఫ్యాక్టరీ అని ముంబాయి బేస్డ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ నిర్మిస్తోంది. మొదటగా చిన్న సినిమాగా చేద్దామనుకున్నా. మా నిర్మాతలకు కథ బాగా నచ్చడంతో వారు లార్జ్‌స్కేల్‌లోనే ప్లాన్‌ చేశారు. హీరోగా కన్నడంలో వరుసగా మూడు సూపర్‌హిట్‌లు ఇచ్చిన యువ హీరోను తీసుకున్నాం. 3 సాంగ్స్‌ కూడా రికార్డింగ్‌ కూడా పూర్తయ్యింది. సంగీత దర్శకుడు శ్రీవెంకట్‌ అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చారు. అలాగే స్క్రీన్‌ ప్లే, మాటలు శేషభట్టర్‌ వేంకట రమణ గారు రాశారు. మాటలు తూటాల్లా ఉంటాయి.

షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమౌతుంది?
త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రస్తుతం నటీ, నటుల ఎంపిక జరుగుతున్నది. హైదరాబాద్‌, బెంగుళూరుల్లో షెడ్యూల్స్‌ ఉంటాయి.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ ప్లానింగ్‌ ఏమైనా ఉందా?
ఇక నుంచి సంవత్సరానికి రెండు సినిమాలైనా చేయాలని నిర్ణయించుకున్నా. నాదగ్గర నాలుగు స్క్రిప్ట్స్‌ సిద్ధంగా ఉన్నాయి. నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారు. ఈ ‘సెటిల్‌మెంట్‌’ నా కమ్‌బ్యాక్‌ మూవీ.. ఇకపై నన్ను ఖాళీగా ఉంచని మూవీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here