Cinemarangam.Com
సినిమా : “‘యాత్ర 2’ ”
విడుదల తేదీ : 8 Feb 2024
రివ్యూ రేటింగ్ : 3.25/5
బ్యానర్ : 3 ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్స్
ప్రొడ్యూసర్: శివ మేక
దర్శకత్వం : మహి వీ రాఘవ్
నటీనటులు: మలయాళ స్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు వై.ఎస్.జగన్ గా జీవా , కేతకి నారాయణ్ , సుజానే బెర్నెర్ట్ తదితరులు
సినిమాటోగ్రఫీ: మది
సంగీతం: సంతోష్ నారాయణన్
పి.ఆర్.ఓ : సతీష్. కె

పాఠశాల, ఆనందోబ్రహ్మ, యాత్ర వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతోపాటు సేవ్ ది టైగర్స్, సైతాన్ వంటి వెబ్ సిరీస్‌లతోనూ ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు మహి వి.రాఘవ్. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన ‘యాత్ర’. సినిమాకు కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడుగా వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితులు,వై.ఎస్.జగన్ పేదల కోసం చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 8న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “‘యాత్ర 2’ ” సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.

కథ
అందరికీ తెలిసినదే ఈ కథ. ప్రారంభం అలాగే ముగింపు ఏంటి అనేది అందరికీ తెలుసు కానీ ఈ సినిమాని ఎలా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలి అనేదే ముఖ్యమైనటువంటి విషయం ఇదే విషయాన్ని డైరెక్టర్ కూడా పలు సందర్భాలలో చెబుతూ వచ్చారు.సినిమా విషయానికి వస్తే..2009 లో హెలికాప్టర్ దుర్ఘటనలో వైఎస్సార్ మరణానంతర సంఘటనలతో కథ ప్రారంభమవుతుంది. వైఎస్సార్ ని అభిమానించే ఎన్నో వేల గుండెలు ఆగిపోవడంతో ఆ కుటుంబాల్ని ఓదార్చదానికి వైఎస్ జగన్ (జీవా) ఓదార్పు యాత్ర చేపడతాడు. ఆ యాత్రలో జగన్‌కి లభిస్తున్న విశేష ఆదరణ చూసి ఢిల్లీ హైకమాండ్ అప్రమత్తమవుతుంది. హైకమాండ్ మేడమ్ సోనియా గాంధీ ( సుజాన్ బెర్నెర్ట్) ని ఎదిరించి యాత్ర కొనసాగిస్తాడు జగన్. ఇక మేడమ్ నుంచి వస్తున్న వార్నింగ్స్ తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేసి అదే పులివెందుల ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఇది చూసి మేడమ్ ఇంకా పగసాధింపుగా జగన్ ని అక్రమ ఆస్తుల కేసుల్లో జైలుకి పంపిస్తుంది. ఇప్పుడు జగన్ ఏం చేశాడు? జైలు నుంచి బయటకెలా వచ్చాడు? 2019 ఎన్నికల్లో ఎలా గెలిచాడు? అసలు 2014 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి కారణమేమిటి? అనేవి తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “యాత్ర 2” సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు
మమ్ముట్టి ఉన్నది కొద్ది సేపూ అయినా వైఎస్సార్ పాత్రలో హుందాతనాన్ని, గొప్పదనం ఉట్టిపడేలా నటించేశాడు . జగన్ పాత్రలో జీవా చాలా చక్కగా నటించాడు అనే దానికంటే ఒదిగిపోయాడు అని చెప్పవచ్చు. మేడమ్ పాత్రలో సుజాన్ బెర్నెర్ట్ అచ్చం సోనియా గాంధీ లాగే వుంది. వైఎస్ భారతీ పాత్రలో కేతకీ నారాయణ్, విజయమ్మగా ఆశ్రితా వేముగంటి నండూరి లు కూడా చాలా చక్కటి నటనను ప్రదర్శించారు.చంద్రబాబు నాయుడి పాత్రలో మహేష్ మంజ్రేకర్ సెట్టయ్యడు. మరో ముఖ్య పాత్రలో శుభలేఖ సుధాకర్ ఆకట్టుకుంటాడు .ఇంకా ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రల మేరకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ సినిమా అయినప్పటికీ
సినిమా చూస్తున్నంత సేపు ఎమోషనల్ అవ్వడం గుండె బరువెక్కడం వంటి సంఘటనలు జరుగుతాయి. తండ్రి కోసం కన్న కొడుకు జైలు పాలు కావటం తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఓ కొడుకు పడే ఆరాటం,
అనే పాయింట్‌తో సినిమాను ఫుల్ ఎమోషనల్‌గా చూపించాడు. ఓ చెవిటి అమ్మాయితో ఉన్న సీన్, ఓ అంధుడితో సీన్ ఇవన్నీ చూస్తున్న ప్రేక్షకులను కంట తడి పెట్టిస్తాయి.ఈ చిత్రంలో ఎక్కడా కూడా ఎవ్వరినీ తక్కువ చేసి చూపించకపోవడం, ఎవ్వరినీ కించపర్చకపోవడం మహి వీ రాఘవలోని రైటింగ్, మేకింగ్, టేకింగ్, టాలెంట్‌కు, గొప్పదనంకు నిదర్శనం.ఎక్కడ ఏమోషనల్ సీన్స్ పెడితే బాగుంటుందని తెలుసుకొని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు మహీ రాఘవ.

అలాగే ఈ ‘యాత్ర 2’ లో సూటిగా జగన్ రాజకీయ జీవితం తప్ప, ఎలాటి వ్యక్తిగత విషయాల జోలికీ వెళ్ళలేదు. 2009 లో ఓదార్పు యాత్రతో ప్రారంభమయిన సంఘర్షణ 2019 లో పాదయాత్ర ఫలితంగా సీఎం అవడంతో బయోపిక్ ముగుస్తుంది. రాజకీయ సినిమా అని సినిమా అంతా నటీనటులతో నింపెయ్యకుండా తక్కువ తారాగణంతో “యాత్ర” లాగే “యాత్ర 2” కూడా చాలా చక్కగా తీసి సక్సెస్ సాధించాడు అని చెప్పవచ్చు.సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి బ్యాక్ బోన్‌గా నిలిచింది .మాటలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ఒక్కో డైలాగ్ వింటుంటే..అది కలంలోంచి కాదు గుండెల్లోంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ మది అందించిన కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది.. ప్రతి ఫ్రేము అందంగా ఉంది. సౌండ్, విజువల్, మేకింగ్..ఎడిటింగ్, ఆర్ట్ ఇలా ప్రతీ ఒక్క అంశంలో యాత్ర 2 హై స్థాయిలో ఉంది. ఇలా ప్రతి అంశంలో ఈ సినిమాకు టెక్నీషియన్స్ బ్యూటిఫుల్ గా వర్క్ చేశారు. 3 ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్స్ బ్యానర్ పై శివ మేక నిర్మించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.వైఎస్ జగన్ అభిమానులనే కాకుండా చూసిన ప్రతి ఒక్కరికీ ఓ ఎమోషనల్ జర్నీలా సాగే “యాత్ర 2” కచ్చితంగా నచ్చుతుంది..
Cinemarangam.com Review Rating 3.25/5









