కాటమరాయుడు తర్వాత శృతిహాసన్ దాదాపు రెండున్నరేళ్లు సినిమాలు తీయకుండా టాలీవుడ్ కు దూరంగా ఉంది. టోటల్ గా సినిమాలకు బ్రేక్ తీసుకుంది ఈ అమ్మడు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తుంది శృతిహాసన్. రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ రవితేజకు 66వ మూవీ. మళ్లీ రవితేజతో కలిసి నటిస్తున్నందకు తనకు ఎంతో ఉత్సాహంగా ఉందని ట్వీట్ చేసింది. అటు తమిళంలో కూడా విజయ్ సేతుపతి హీరోగా ఎస్ పి జననాథన్ డైరెక్షన్ లో లాభం అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది శృతిహాసన్.
పవన్ – క్రిష్ సినిమా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. మొదట్లో చేయనని తన ఫోకస్ మొత్తం రాజకీయాల మీదే ఉందని ప్రకటనలు చేసిన పవన్ అంతకు ముందు అడ్వాన్స్ లు తీసుకున్న నిర్మాతల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదని అంటున్నారు. రీ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ అంటున్నారు కానీ సినిమా ఎవరితో ఉంటుందనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. అయితే క్రిష్ దర్శకత్వంలో సినిమాతో పవన్ తన రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని అంటున్నారు. ఇక ఆ సినిమా ఓపెనింగ్ కూడా వచ్చే నెల 15న జరగనుందని అంటున్నారు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ లో జానపద జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ పవన్ జానపద జోనర్ చేయలేదు. కాబట్టి ఇది చాలా కొత్త ప్రయత్నమనే అంటున్నారు.
ప్రభాస్ అనుష్కలకు హాలీవుడ్ అఫర్?
ప్రభాస్ .. అనుష్క టాలీవుడ్ లో సూపర్ జోడి. అందులో సందేహం అవసరం లేదు. బిల్లా, మిర్చి, బాహుబలి సీరీస్ లో కలిసి నటించారు. ఈ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కాగా, ఇటీవలే బాహుబలి సినిమా లైవ్ మ్యూజిక్ లండన్ లోని రాయల్ అల్బెర్ట్ హాల్ లో ప్రదర్శించారు. 148 సంవత్సరాల ఆల్బర్ట్ హాల్ చరిత్రలో మొదటిసారి నాన్ ఇంగ్లీష్ సినిమాను ప్రదర్శించారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇదిలా ఉంటె, హాలీవుడ్ లో ఆఫర్లు వస్తే చేస్తారా అని అడిగితె.. హాలీవుడ్‌లో సరైన స్క్రిప్టు, ఆఫర్ వస్తే తప్పకుండా నటిస్తాను అని ప్రభాస్ చెప్పగా, నాకు భాష అడ్డంకి కాదు. సినిమాలో నటించడమే నా పని. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషా సినిమాల్లో నటించాలని ఉంది అని అనుష్క చెప్పింది. సో, మంచి అఫర్ దొరికితే ఇద్దరు హాలీవుడ్ సినిమాలో నటిస్తారన్నమాట.
లాలూ ప్రసాద్ బయోపిక్: లాంతరు
సినిమా ఇండస్ట్రీలో కొంత కాలంగా ప్రముఖులు…స్పోర్ట్స్ స్టార్ల బయోపిక్ ల హవా నడుస్తోంది. నిర్మాతలు, దర్శకులు కూడా వాటిని నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ జీవితంపై సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్ర దర్శక.. నిర్మాతలు. లాలూ పార్టీ ఆర్జేడీ గుర్తు లాంతరు కావడంతో ఆయన సినిమాకి లాంతరు అనే పేరు పెట్టినట్టు సమాచారం. ప్రముఖ భోజ్‌పురి నటుడు యశ్ కుమార్ ..లాలూ పాత్రలో కనిపించనున్నాడు. లాలూ సతీమణి రబ్రీదేవి పాత్రలో స్మృతి సిన్హా నటించనున్నారు.
గీతాంజలికి కన్నీటి నివాళి
సీనియర్ నటి గీతాంజలి కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం గుండెపోటుకు గురైన గీతాంజలిని కుటుంబసభ్యులు హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గీతాంజలి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లోని సభ్యులు గీతాంజలి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు కన్నీటి నివాళి అర్పించారు.
రివ్యూ : విజిల్
నటీనటులు : విజయ్,నయనతార,యోగి బాబు,వివేక్,జాకీ ష్రాఫ్,ఖదీర్ తదితరులు
దర్శకత్వం : అట్లీ
నిర్మాతలు : కళాపతి ఎస్ అఘోరం
సంగీతం : ఏ ఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫర్ : జి కె విష్ణు
తలపతి విజయ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపొందిన విజిల్ నేడు విడుదలైంది.ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన విజిల్ మూవీలో విజయ్ సరసన నయనతార నటించగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
కథ:
మైకేల్(విజయ్) తన చుట్టూ ఉన్న వారికి సాయం చేస్తూ స్థానికులలో మంచి పేరున్న ఓ యువకుడు. తన మంచితనం వలన మైకేల్ కి స్థానిక రౌడీ ముఠాలతో వైరం నడుస్తూ ఉంటుంది. ఫుట్ బాల్ లేడీ టీం కోచ్ అయిన మైకేల్ మిత్రుడు ఓ సంఘటన వలన తీవ్ర గాయాలకు లోనవుతాడు, దీనితో మైఖేల్ ఆ లేడీ ఫుట్ బాల్ టీం కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. లోకల్ రౌడీగా చలామణి అవుతున్న మైకేల్ ఫుట్ బాల్ టీం కోచ్ ఎలా అయ్యాడు? అతన్ని ఆ జట్టు సభ్యులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అసలు ఈ మైకేల్ గతం ఏమిటీ? అతని సారథ్యంలోని ఫుట్ బాల్ టీం లక్ష్యం సాధించిందా? అనే సమాధానాలు తెరపై చూసి తెలుసుకోవాలి…
విశ్లేషణ:
మొత్తంగా చెప్పాలంటే విజిల్ మూవీ మాస్ ఎలిమెంట్స్ మరియు ఎమోషనల్ కంటెంట్ తో సాగే స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆసక్తిగా సాగే సన్నివేశాలు, ఎమోషన్స్ తో ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది. మాస్ ఇమేజ్ ఉన్న విజయ్ ని అట్లీ ఒక రేంజ్ లో తెరపై ప్రెసెంట్ చేశారు.తమిళ నేటివిటీ తో సాగే చాలా సన్నివేశాలు తమిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి అనడంలో సందేహం లేదు. కానీ తెలుగు ప్రేక్షకులకు కొంచెం రొటీన్ అన్న భావన రావొచ్చు. ఐతే ప్రేక్షకుడిని నిరాశపరిచే చిత్రం ఐతే కాదు. ఏదేమైనా విజిల్ మూవీ అందరూ చూడదగ్గ చిత్రమే. విజయ్ ఫ్యాన్స్ చేత విజిల్ మూవీ విజిల్ వేయిస్తుంది అనడంలో సందేహం లేదు
రివ్యూ:ఖైదీ
మూవీ : ఖైదీ
జానర్ : యాక్షన్ థ్రిల్లర్
నటీనటులు : కార్తీ, నరైన్, రమణ, జార్జ్ మార్యన్ తదితరులు
ఎడిటింగ్ : ఫిలోమన్ రాజు
సంగీతం : సామ్ సీఎస్
డైరెక్టర్ : లోకేశ్ కనగరాజ్
నిర్మాతలు : ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్
విభిన్న కథలను ఎంచుకోవడంలో కోలీవుడ్ యాంగ్రీ హీరో కార్తీ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పటివరకు అతడు తీసిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. చినబాబు, ఖాకీ వంటి సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ హిట్‌ను సాధించలేకపోయాయి. అనంతరం కమర్షియల్ హంగులతో వచ్చిన ‘దేవ్’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని తెలుగు సూపర్ హిట్ టైటిల్ ‘ఖైదీ’తో థియేటర్ తలుపులు తట్టాడు కార్తీ. ఖైదీ అనగానే తెలుగు ప్రేక్షకుల అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. మరి కార్తీ ఖైదీ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాయా?
కథ
ఆది శంకర్ (హరీష్ ఉత్తమన్) అనే గ్యాంగ్‌స్టర్ తెలుగు రాష్ట్రాల్లోకి అక్రమంగా కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను తీసుకొస్తాడు. చిత్తూరు నుంచి ఆ డ్రగ్స్‌ను మిగిలి ప్రొంతాలకు తరలించాలని ప్లాన్ చేస్తాడు. అయితే, కొంత మంది పోలీసులు ఆ గ్యాంగ్‌లో అండర్ కవర్ ఆఫీసర్లుగా ఉండటంతో ఆ సరుకు మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఎస్పీ ఆఫీసులో దాచిపెడతారు.
ఆ డ్రగ్స్‌ను ఎలాగైనా చేజిక్కుంచుకోవాలని, ఇన్ఫార్మర్లుగా ఉన్న పోలీసులను చంపేయాలని ఆది శంకర్ గ్యాంగ్ ప్లాన్ వేస్తుంది. ఇదే సమయంలో జైలు నుంచి విడుదలైన ఢిల్లీ (కార్తి) అనుకోకుండా పోలీసుల దగ్గర ఇరుక్కుంటాడు. అయితే, ఆ పోలీసులకు ఢిల్లీనే దిక్కవుతాడు. ఖైదీ జీవితాన్ని అనుభవించి బయటికి వచ్చిన ఢిల్లీ.. అసలు పోలీసులకు ఎందుకు సాయం చేశాడు? గ్యాంగ్‌స్టర్స్ నుంచి వాళ్లను ఎలా కాపాడాడు అనేదే సినిమా.
విశ్లేషణ:
చాలా కాలంగా కమర్షియల్ హిట్ లేని కార్తీ ఈ కథను ఓకే చేసి రిస్క్ చేశాడనే చెప్పొచ్చు. ఎందుకంటే కామెడీ, హీరోయిన్, రొమాన్స్, పాటలు లేకుండా కమర్షియల్ హిట్ సాధించడం సాధ్యం కాదు. అయితే హాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. దీంతో ప్రయోగాత్మకంగా యువ దర్శకుడు లోకేశ్‌ను, కథను పూర్తిగా నమ్మి కార్తీ ఈ చిత్రానికి ఓకే చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకొని.. సందీప్ కిషన్‌తో ‘మానగరం’వంటి హిట్ సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్ ఈ సినిమాను పూర్తిగా తన భుజస్కందాలపై మోశాడు.
రివ్యూ:రాజుగారి గది 3
జానర్ : హర్రర్ కామెడీ
నటీనటులు : అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ, బ్రాహ్మాజీ, గెటప్ శ్రీను, శివశంకర్ మాస్టార్, హరితేజ
సంగీతం : షబీర్
దర్శకత్వం : ఓంకార్
నిర్మాణం : ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్
‘ఆట’లాంటి షోస్‌తో టెలివిజన్ తెరపై సత్తా చాటిన ఓంకార్.. దర్శకుడిగా ‘రాజుగారి గది’ సినిమాతో సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు. హర్రర్ కామెడీ జానర్‌లో తీసిన ‘రాజుగారి గది’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సిరీస్‌లో తీసే చిత్రాలకు క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత నాగార్జున, సమంత వంటి అగ్రశ్రేణి స్టార్స్‌తో తీసిన ‘రాజుగారి గది-2’ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి హర్రర్ కామెడీనే నమ్ముకున్న ఓంకార్ ‘రాజుగారి గది-3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి అశ్విన్ బాబుకు జోడీగా అవికా గోర్ నటించిన ‘రాజుగారి గది-3’ ప్రేక్షకులను మెప్పించిందా?
కథ:
మాయా (అవికా గోర్) ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంటుంది. ఆమె తండ్రి గరడపిళ్లై. కేరళలో పేరుమోసిన మాంత్రికుడు. ఈ క్రమంలో మాయను ఎవ్వరూ వెంబడించి వేధించినా.. ఐ లవ్యూ చెప్పినా.. మాయాను అనుసరిస్తూ ఉండే ఓ దెయ్యం వారి భరతం పడుతుంది. మరోవైపు అశ్విన్ ఓ కాలనీలో ఆటోడ్రైవర్. నిత్యం తాగి తందనాలు ఆడుతూ.. కాలనీ వాసులను వేధించుకు తింటుంటాడు. మాయను ప్రేమించి.. ఐలవ్యూ చెప్పి దెయ్యం చేతిలో చావుదెబ్బలు తిన్న డాక్టర్ శశి (బ్రహ్మాజీ).. కాలనీ వాసులతో పథకం రచించి.. మాయను అశ్విన్ ప్రేమించేలా చేస్తాడు. అశ్విన్ కూడా మాయకు ఐలవ్యూ చెప్పడంతో దెయ్యం అతనికి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో గరడపిళ్లైతో తాడో-పెడో తేల్చుకోవడానికి అశ్విన్, తన మామ అలీతో కలిసి కేరళ వెళుతాడు. అక్కడ అశ్విన్‌కు ఎదురైన పరిస్థితులేమిటి? యక్షిని ఎవరు? మాయకు రక్షణగా యక్షిని ఎందుకు తిరుగుతుంది? యక్షిని బారి నుంచి మాయను ఎలా రక్షించి.. అశ్విన్ పెళ్లి చేసుకున్నాడు? రాజుగారి గదిలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అన్నది తెలుసుకోవడానికి సినిమా చూడాలి.
విశ్లేషణ:
హర్రర్ కామెడీ సినిమాలకు బలమైన కథ, కథనాలు ముఖ్యం. దర్శకుడిగా ఓంకార్.. ఈ హర్రర్ కామెడీ సినిమాకు ఒకింత డిఫరెంట్ పాయింట్‌నే ఎంచుకున్నారు. అమ్మాయి వెంటపడే వ్యక్తులనే యక్షిని రఫ్ ఆడటమనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. సెకండాఫ్‌లో రాజుగారి గదిలోకి పాత్రలు ఎంటరైన తర్వాత పూర్తిగా కామెడీ మీద ఫోకస్ చేయడం కొంత ప్రేక్షకులకు నిరాశకు గురిచేయవచ్చు. అంతగా భయపెట్టి థ్రిల్ చేసే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. సెకండాఫ్‌లో దెయ్యాలన్నీ వచ్చి కామెడీ పండించడం తప్ప పెద్దగా ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేయవు. యక్షిని నేపథ్యాన్ని కార్టూన్‌రూపంలో చెప్పడం కన్విన్సింగ్గానే ఉన్నా.. ఇంకాస్త మెరుగ్గా చెబితే ప్రేక్షకుల్లో నాటుకుపోయేది. దర్శకుడిగా ఓంకార్ టేకింగ్ బాగుంది. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫి.. షబీర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను బాగా ఎలివేట్ చేశాయి. ఎప్పటిలాగే బుర్ర సాయిమాధవ్ డైలాగులు హాస్యాన్ని పండిస్తూ.. అదనపు బలాన్ని చేకూర్చాయి. షబీర్ పాటలు అంతగా గుర్తుండిపోవు కానీ పాటల టేకింగ్ బావుంది. మొత్తానికి ఈ హర్రర్ కామెడీలో హర్రర్ అంతలేకపోయినా కామెడీ ప్రేక్షకులను మెప్పించవచ్చు.
సినిమాల్లోకి పవన్ వారసుడు
పవన్ కొడుకు అకీరా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే అకీరా మరాఠీలో ఓ సినిమా చేశారు. దాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, పవన్ కొడుకు అకీరాను ఇలా డబ్బింగ్ సినిమాతో లాంచ్ చేయకుండా.. ఒక హీరో కొడుగ్గానే లాంచ్ చేయాలని చూస్తున్నారు. మరో కొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన అన్ని విషయాలు బయటకు రాబోతున్నది. అకీరా ఎంట్రీకి అన్ని రకాలుగా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే అకిరా లాంచింగ్ ఉంటుందని అంటున్నారు. ఎవరు ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు అన్నది త్వరలోనే తేలిపోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం అన్నయ్య రామ్ చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్లోనే సినిమా ఉండబోతుందని సమాచారం.
నిహారిక బన్నీ సినిమాలో
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నటి నిహారికకి సరయిన హిట్ ఒక్కటీ పడలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఆమెకు చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు. దీంతో ఆమె వెబ్ సిరీస్ ల మీద ద్రుష్టి పెట్టి కొన్ని వెబ్ సిరీస్ లు కూడా నిర్మించింది. అయితే ఆమె తాజాగా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆమె గురించి ఫిలిం నగర్ లో ఓ కొత్త గాసిప్ వినిపిస్తోంది. అదేంటంటే ఆమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో నటిస్తోందట. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాక ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది.
ఈ సినిమాలోనే లేడీ లీడ్ కాదు కానీ చాలా కీలకం అని చెప్పబడుతున్న పాత్ర ఆమె చేత చేయిస్తున్నారని అంటున్నారు. ఆమె తాజాగా సైరాలో కూడా నటించారు, ఒక కోయ యువతి పాత్రను పోషించారు. ఇక సుకుమార్ సినిమాలో పాత్రకు నిహారిక అయితే బాగుంటుందని చెప్పగా అల్లు అర్జున్ స్వయంగా నిహారికతో ఆ పాత్ర గురించి చర్చించి, నటించాల్సిందిగా కోరాడని ప్రచారం జరుగుతోంది. సుకుమార్ సినిమా అందులోనూ కీలక పాత్ర అని చెప్పడంతో నిహారిక వెంటనే ఒప్పేసుకుందని అంటున్నారు. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడితే కానీ ఏమీ చెప్పలేం. త్రివిక్రమ్ సినిమా షూట్ లో ఉండగానే ఈ సినిమా మొదలు కానుందని ప్రచారం జరుగుతోంది.















