Home Blog Page 67

My Journey – From a Simple Idea to a Successful Brand.. Keerthi Chandragiri

ఆరోగ్యాన్ని ప్రతి ఇంటికీ చేరవేయాలన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు ఆరోగ్యపరుల హృదయాల్లో నిలిచిపోయిన బ్రాండ్ – ఎలిక్స్ఆర్ (ElixR)గా ఎదిగేలా చేసింది కీర్తి చంద్రగిరి. తను ఎంబీఏ పూర్తి చేసి, 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో, కీర్తి తిరిగి స్వదేశానికి వచ్చి క్లీన్, ఫ్రెష్, ప్రిజర్వేటివ్-రహిత ఆహారం అందించాలన్న లక్ష్యంతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టింది.

“ఎలిక్స్ఆర్” అనే పేరు “Elixir” అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం – జీవానికి ఉజ్వలతనిచ్చే మాయాజలము, ఆరోగ్యాన్ని పునరుద్ధరించే అద్భుతమైన ఔషధం.ఈ పేరును ఆమె ఎన్నుకోవడం వెనుక ఉన్న భావన – ప్రతి జ్యూస్, ప్రతి బౌల్, ఒక చిన్న అద్భుతంగా ఉండాలి – మన శరీరానికీ, మనసుకూ శక్తినిచ్చే ఆహారంగా.

జ్యూస్‌లు, ఫ్రూట్ బౌల్స్, వెజ్ సలాడ్లు – ప్రతీ ఉదయం మీ ఇంటికే
Nutritionist ఆమోదించిన cold-pressed జ్యూస్‌లు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడి, చల్లగా ప్రాసెస్ చేయబడతాయి. దీంతో వాటిలో పోషక విలువలు 100% నిలిచిపోతాయి.

ఇటీవలే వారు ప్రారంభించిన ఫ్రూట్ బౌల్స్ మరియు వెజిటబుల్ సలాడ్ బౌల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఆమె philosophy సింపుల్ – “ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అందుబాటులో ఉండాలి”. అందుకే ఈ పౌష్టికమైన ఎలిక్సిర్స్ మరియు బౌల్స్‌ అన్ని వయస్సుల వారికి అందుబాటైన ధరలకే అందిస్తున్నారు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్‌లేకుండా స్వచ్ఛమైన పదార్థాలతో తయారు చేస్తారు.

ఈ ఆరోగ్యభరిత ఆహారం ప్రతీ ఉదయం మీ ఇంటికే డెలివరీ అవుతుంది – అది కూడా పూర్తిగా తాజా పదార్థాలతో, ఎలాంటి కలర్ లేదా కెమికల్స్ లేకుండా!

ప్రతి అవసరానికి ఒక హెల్త్ ప్లాన్
ElixR నుండి అందే Subscription Plans:

Radiance Sips – చర్మ కాంతి కోసం

Immunity Boosters – రోగ నిరోధక శక్తికి

Fat Burners – బరువు తగ్గించేందుకు

Gut & Liver Detox – అంతఃశుద్ధి కోసం

Kids Special – పిల్లల ఆరోగ్యానికి

Simple Squeeze – సాధారణ ఆరోగ్యపరమైన జీవనశైలి కోసం

కొత్త కస్టమర్లకు అత్యంత ప్రాచుర్యం పొందిన ప్లాన్ – One-Day Detox Plan. ఇది శరీరాన్ని తక్కువ సమయంలో రిలాక్స్ చేసి, రీసెట్ చేసేలా రూపొందించబడింది.

ప్రజల ఆదరణతో వేగంగా ఎదుగుతున్న బ్రాండ్
ఇది ఇక సాధారణ వ్యాపారం కాదు. హైదరాబాద్లో ఇప్పటికే వందలాది మంది వినియోగదారులు ElixR ఉత్పత్తులను ప్రేమగా వినియోగిస్తున్నారు. నిజాయితీ, నాణ్యత మరియు కస్టమర్ నమ్మకంతో ఈ బ్రాండ్ వేగంగా బూమ్ అవుతోంది.

కీర్తి సందేశం
“ప్రతి ఇంట్లో ఆరోగ్యాన్ని చేర్చాలన్నది నా కల. ఆరోగ్యంగా తినడం మొదలైతే – జీవితం లో అన్ని మార్పులూ సహజంగానే వస్తాయి,” అంటోంది కీర్తి.

“ElixR అనేది బ్రాండ్ కాదు, అది నా విశ్వాసాన్ని బాటిల్‌లో పెట్టినట్టు!”

మీ ఆరోగ్య ప్రయాణం ఇవాళ్టి నుంచే మొదలు పెట్టండి!

ఆరోగ్యం మీ ఇంటికే, ప్రతీ ఉదయం

Power Star Pawan Kalyan’s “HARI HARA VEERAMALLU” Success Celebrations held grandly

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టింది. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ధర్మం కోసం పోరాడిన వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నటీనటుల అద్భుత నటన, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ, సంగీతం ఇలా ప్రతి విభాగం యొక్క పనితీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవ వేడుకను నిర్వహించిన చిత్ర బృందం.. తమ ఆనందాన్ని పంచుకోవడమే కాకుండా, ‘హరి హర వీరమల్లు’ సినిమాకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది

  • పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. నా జీవితంలో ఏదీ అంత తేలికగా జరగదు. ఈ సినిమా విడుదల విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా 29 ఏళ్ళ సినీ ప్రయాణంలో నేను ఒక సినిమాని ఇలా ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమా బాధ్యత తీసుకోవడం కూడా ఓ రకంగా ఆనందాన్ని ఇచ్చింది. ఏ సినిమాకైనా భావోద్వేగాలు ముఖ్యం. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకి గుర్తుండేది.. మనం ఏ ఎమోషన్ ని ఇంటికి పట్టుకొస్తామని. ఈ చిత్ర కథ మొఘల్స్ కి సంబంధించినది. మనం చదువుకున్న పుస్తకాల్లో ఔరంగజేబు గొప్పతనాన్ని చెప్పారు తప్ప.. అతని దుర్మార్గాన్ని చెప్పలేదు. మొఘల్స్ 200 ఏళ్ళే పాలించారు. చాళుక్యులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం కొన్ని వందల ఏళ్ళు పాలించారు. కానీ, చరిత్రలో మొఘల్స్ గురించే ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. మన చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపైన చిన్నచూపు చూశారు. ఔరంగజేబు పాలన సమయంలో హిందూదేశంలో హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఆ విషయాన్ని ఈ సినిమాలో నిర్భయంగా ప్రస్తావించాము. నాకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్, నాకున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రజా సమస్యలపై పోరాడేతత్వం.. ఇవన్నీ కలిసి నన్ను ప్రీ క్లైమాక్స్ లో 18 నిమిషాల ఫైట్ ను డిజైన్ చేయడానికి ప్రేరణ ఇచ్చాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ ఎపిసోడ్ బాగుందని ప్రశంసించడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా మతాలకు సంబంధించింది కాదు. ఇందులో మంచి, చెడుకి మధ్య జరిగిన యుద్ధాన్ని చూపించాము. ఈ చిత్రం విడుదల విషయంలో రత్నం గారికి అండగా నిలిచిన మైత్రి మూవీ మేకర్స్ కి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను ఇంత బలంగా నిలబడ్డానంటే నాకు అభిమానులు ఇచ్చిన బలమే కారణం. ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు, రికార్డుల కంటే కూడా.. ఈ సినిమా ద్వారా చరిత్రలో దాగి ఉన్న నిజాన్ని చెప్పామనేది ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోంది. శంకరాభరణం సినిమా చూసిన తర్వాత నాకు శాస్త్రీయ సంగీతం పట్ల అపారమైన గౌరవం వచ్చింది. ఒక సినిమా ఏం చేయగలదు అనేదానికి ఇదొక ఉదాహరణ. సినిమా అనేది కథ ఎలా చెప్పాము, ప్రేక్షకుల్లో ఎంత ప్రేరణ కలిగించాము అనేది ముఖ్యం. ఆ పరంగా వీరమల్లు చిత్రం యొక్క లక్ష్యం నెరవేరింది. సాంకేతికంగా కొందరు కొన్ని సూచనలు చేశారు. ఆ విషయాలను రెండో భాగం విషయంలో పరిగణలోకి తీసుకుంటాము. కోహినూర్ కంటే విలువైన జ్ఞానం మన దేశం సొంతం అని ఈ సినిమాలో చూపించాము. హరి హర వీరమల్లులో చరిత్రలో దాగి ఉన్న ఎన్నో వాస్తవాలను చెప్పాము. నా దృష్టిలో అదే నిజమైన విజయం. ఇలాంటి గొప్ప సినిమా తీసిన రత్నం గారికి అండగా నిలబడటం నా బాధ్యతగా భావించాను.” అన్నారు.

చిత్ర కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “హరి హర వీరమల్లు విడుదలై మంచి స్పందన తెచ్చుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలైనప్పటి నుంచి అభినందనలు తెలుపుతూ ఫోన్లు, మెసేజ్ లు వస్తున్నాయి. ఇదంతా పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైనది. రత్నం గారు, జ్యోతికృష్ణ గారితో పాటు టీం అంతా ఐదేళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందని మొదటి నుంచి నమ్మాను. మనం మనస్ఫూర్తిగా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం లభిస్తుందని హరి హర వీరమల్లుతో మరోసారి రుజువైంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు.” అన్నారు.

చిత్ర సమర్పకులు, ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, “సినిమా బాగుందని అందరూ అభినందలు తెలపడం ఆనందాన్ని కలిగించింది. హరి హర వీరమల్లు సినిమా కాదు.. ఇదొక చరిత్ర. ఔరంగజేబు కేవలం తన మతం మాత్రమే ఉండాలని అనుకుంటాడు. అతన్ని ఎదిరించి ధర్మాన్ని రక్షించే వీరుడి కథే ఈ వీరమల్లు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక సింహంలాంటి యోధుడి లాగా కనిపించారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో వీరవిహారం చేశారు. ‘ఇది సార్ మేము పవన్ కళ్యాణ్ గారి నుంచి కోరుకునేది’ అని అభిమానులు ఫోన్లు చేసి చెప్తున్నారు. కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మా కష్టానికి తగ్గ భారీ విజయం లభిస్తుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ, “థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకుల స్పందన చూసి చాలా సంతోషం కలిగింది. సినిమాని ముగించిన తీరు అద్భుతంగా ఉంది, రెండవ భాగం చూడాలనే ఆసక్తి కలుగుతోందని చాలామంది ఫోన్ చేసి ప్రశంసించారు. చిన్న చిన్న పిల్లలు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే అందరూ కలిసి చూస్తారు. పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి మంచి సినిమా చేయడం గర్వంగా ఉంది. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు.. ఒకరు పవన్ గారు, ఇంకొకరు కీరవాణి గారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు 18 నిమిషాల ఫైట్ సీక్వెన్స్ ను కంపోజ్ చేశారు. పెద్దగా సంభాషణలు లేకుండా దాదాపు 30 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ ని కీరవాణి గారు తన సంగీతంతో మరోస్థాయికి తీసుకెళ్లారు. నిధి అగర్వాల్ గారు ఐదేళ్లుగా ఈ సినిమాను నమ్మి నిలబడ్డారు. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ సపోర్ట్ ను మరువలేను. మా నాన్న రత్నం గారు తన మొదటి సినిమా హిట్ అయినప్పుడు ఎంత ఆనందపడ్డారో.. మళ్ళీ అంతటి ఆనందాన్ని ఇన్నాళ్లకు ఆయన ముఖంలో చూశాను. ఈ సినిమా ఆయనకు ఎంతటి డ్రీం ప్రాజెక్టో ఆ సంతోషంలోనే తెలుస్తోంది. ఈ సినీ ప్రయాణంలో నా భార్య, మా అమ్మ ఇచ్చిన సపోర్ట్ ని ఎప్పటికీ మరచిపోలేము. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పవన్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.” అన్నారు.

ప్రముఖ నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ, “పవర్ స్టార్ గారి పవర్ ఏంటో మేము నిన్న విమల్ థియేటర్ సాక్షిగా చూశాను. ఒక్క షో ప్రీమియర్ కే రూ.3.36 కోట్ల షేర్ చేసింది. ఆ నెంబర్ చూసి మేము షాక్ అయ్యాము. మొదటి రోజు వసూళ్ల పరంగా రికార్డు నెంబర్లు చూడబోతున్నాం. అన్ని చోట్లా అద్భుతమైన స్పందన లభిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు తెర మీద కనిపిస్తే ఆ ఆనందమే వీరు.” అన్నారు.

ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ, “హరి హర వీరమల్లు ఘన విజయం సాధించిన సందర్భంగా రత్నం గారికి మరియు చిత్ర బృంద అందరికీ శుభాకాంక్షలు. అన్ని చోట్లా నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రికార్డు కలెక్షన్లు చూడబోతున్నాం.” అన్నారు.

తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్,
ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి, నాజర్, సునీల్, రఘుబాబు,
సుబ్బరాజు, మురళి శర్మ, అయ్యప్ప శర్మ, కబీర్ సింగ్,
వెన్నెల కిశోర్, మకరందేశ్ పాండే, కబీర్ బేడీ,
సచిన్ కెడేకర్, ఛత్రపతి శేఖర్,
దర్శకత్వం: జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: చంద్రబోస్, పెంచల్ దాస్, చైతన్య కృష్ణ, రాంబాబు గోశాల.
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్,
యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: గణేష్, శోభి.
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, పీటర్ హెయిన్,
స్టంట్ సెల్వ, దిలీప్ సుబ్బరాయన్, విజయ్, డ్రాగన్ ప్రకాష్.
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పాయ్.
ఎక్సుక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్
కో డైరెక్టర్: కే. రంగనాథ్
కాస్ట్యూమ్ డిజైనర్: ఐశ్వర్య రాజీవ్
స్టిల్స్: వెంకట్
పబ్లిసిటీ డిజైనర్: అనంత్

Power Star Pawankalyan’s Highly Anticipated Film ‘HARIHARA VEERAMALLU’ Pre Release Event held grandly

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. జూలై 21(సోమవారం) సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చిత్రం బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “లక్షలాది అభిమానుల మధ్య ఈ వేడుకను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసినా.. వర్షాలు, ఇతరత్రా కారణాల వల్ల తక్కువమందితో నిర్వహిస్తున్నాము. అభిమానుల క్షేమం గురించి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వేడుకకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి, డీజీపీ జితేందర్ గారికి, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాల్లోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నానో, అలాగే రాజకీయాల్లోకి వచ్చి ఈశ్వర్ ఖండ్రే గారి లాంటి మంచి స్నేహితుడిని సంపాదించుకున్నాను. బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన ఇక్కడికి వచ్చినందుకు కృతఙ్ఞతలు. అలాగే ఈ వేడుకకు విచ్చేసిన కందుల దుర్గేష్ గారు, రఘురామకృష్ణ రాజు గారికి కూడా నా ధన్యవాదాలు. రెండు సంవత్సరాల క్రితం ‘భీమ్లా నాయక్’ విడుదలైనప్పుడు.. అన్ని సినిమాలకు వందల్లో ఉంటే, ఆ సినిమాకి 10, 20 రూపాయలు టికెట్ రేట్లు చేశారు. నేను అప్పుడు ఒక మాట చెప్పను ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని. ఇది డబ్బు గురించి కాదు, రికార్డుల గురించి కాదు. మనం ధైర్యంగా నిలబడితే న్యాయం జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు. నేను అసలు నటుడు అవ్వాలని కూడా కోరుకోలేదు. సగటు మనిషిగా బ్రతకాలన్న ఆలోచన తప్ప ఏంలేదు. నన్ను ఇంతటి వాడిని చేసింది అభిమానులే. పడినా, లేచినా, ఎలా ఉన్నా.. అన్నా నీ వెంట మేమున్నాం అన్నారు. నా దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు.. గుండెల్లో ఉండే అభిమానులు తప్ప ఎవరూ లేరు. నేను సినీ పరిశ్రమకు వచ్చి 29 ఏళ్ళు. కొంచెం వయసు పెరిగిందేమో కానీ, గుండెల్లో చావ ఇంకా బ్రతికే ఉంది. వరుస హిట్స్ ఇచ్చిన నేను.. జానీతో పరాజయం చూశాను. ఆ సమయంలో అర్థమైంది.. ఇక్కడ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని. కానీ నేను ఒకటే నమ్మాను.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేదు, నన్ను ప్రేమించే నా అభిమానులు ఉన్నారని. చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాను. పేరుంది, ప్రధాన మంత్రి గారి దగ్గర నుంచి అందరూ తెలుసు. కానీ, దాని వల్ల డబ్బులు రావు. సినిమా చేసే డబ్బులు సంపాదించాలి. నాతో ఖుషి సినిమా తీసిన రత్నం గారు ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. నేను పరాజయాల్లో ఉన్నప్పుడు నా పక్కన నిలబడింది త్రివిక్రమ్ గారు. అపజయాల్లో ఉన్న నన్ను వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు, నా ఆత్మ బంధువు త్రివిక్రమ్.. అప్పుడు నాతో జల్సా సినిమా తీశారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. నాకు అలాంటి స్నేహితుడు త్రివిక్రమ్ గారు. నేను రీమేక్ సినిమాలు చేయడం మీకు నచ్చకపోవచ్చు. కానీ, నా కుటుంబాన్ని పోషించడానికి, పార్టీని నడపడానికి తక్కువ సమయంలో డబ్బులు కావాలంటే రీమేక్ సినిమాలు చేయక తప్పలేదు. నాకు దేశం పిచ్చి, సమాజ బాధ్యత పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా చేయాలనుకుంటే.. అది ఎ.ఎం. రత్నం గారి ద్వారా వచ్చింది. మొదట రత్నం గారు కూడా రీమేక్ చేయాలనుకున్నారు. కానీ, క్రిష్ గారు ఈ కథ చెప్పారు. ఈ సినిమాకి పునాది వేసింది ఆయనే. నాటు నాటు పాటతో ప్రపంచాన్ని ఉర్రుతలూగించి ఆస్కార్ గెలిచారు కీరవాణి గారు. కరోనా వంటి కారణాల సినిమా ఆలస్యమవ్వడంతో నిరుత్సాహం వచ్చేది. కానీ, కీరవాణి గారి సంగీతం విన్న వెంటనే మళ్ళీ ఉత్సాహం కలిగేది. కీరవాణి గారి సంగీతం లేకుండా హరి హర వీరమల్లు లేదు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉండి కూడా.. అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. నేను ఖుషి సినిమా చేస్తున్న సమయంలో జ్యోతికృష్ణ లండన్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. ఆయన ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేశారు. తండ్రికి ఉన్న విజన్ కి కొడుకు సారధ్యం వహించారు. తండ్రీకొడుకుల ఎఫర్ట్ ఈ సినిమా. రత్నం గారికి, జ్యోతికృష్ణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను మంత్రి అయిన తర్వాత.. పాలనా సమయానికి ఇబ్బంది కలగకుండా, నా వ్యక్తిగత సమయాన్ని ప్రతి రోజూ రెండు గంటలు కేటాయించాను. అందుకు తగ్గట్టుగా జ్యోతికృష్ణ, పరమహంస గారు షూట్ ని ప్లాన్ చేసి.. అద్భుతమైన అవుట్ పుట్ తీసుకొచ్చారు. ఈ సినిమాని ఒంటి చేత్తో నెల రోజులుగా ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ గారికి అభినందనలు. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ అద్భుతంగా నటించారు. హరి హర వీరమల్లు నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. మన భారతదేశం ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరినీ ఆక్రమించుకోలేదు. మనం చదువుకున్న పుస్తకాల్లో మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప.. వారి అరాచకాన్ని చెప్పలేదు. ఔరంగజేబు సమయంలో నువ్వు హిందువుగా బ్రతకాలంటే టాక్స్ కట్టాలి అన్నారు. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ ప్రజల పక్షాన నిలబడ్డారు. ఇలాంటి నేపథ్యంలో వీరమల్లు అనే కల్పిత పాత్రతో ఒక సగటు మనిషి ఏం చేసి ఉండొచ్చు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం. కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం ఎన్నో చేతులు మారుతూ ఇప్పుడు లండన్ లో ఉంది. కోహినూర్ నేపథ్యంలో క్రిష్ గారు కథ చెప్పినప్పుడు ఆసక్తికరంగా అనిపించి సినిమా చేయడానికి అంగీకరించాను. ఈ సినిమా కోసం మేము మా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాము. నాకు తెలిసిన వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ తో 18 నిమిషాల క్లైమాక్స్ ను నేను కొరియోగ్రఫీ చేశాను. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

కర్ణాటక అటవీ శాఖ మంత్రివర్యులు ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారికి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ జనరేషన్ లోని గొప్ప నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప మనిషి కూడా. సమాజానికి సేవ చేయడంలో ముందుంటారు. సినీ రంగంతో పాటు, రాజకీయం రంగంలోనూ రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్. పార్టీలు వేరయినా సమాజానికి సేవ చేయడమే మా లక్ష్యం. నిర్మాత ఈ వేడుకకు ఆహ్వానించడం ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. యువత ఆయనను అనుకరిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే బడా హీరో, బడా నిర్మాత కలిసి చేసిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆశిస్తూ.. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ, “అశేష అభిమాన జన సందోహంతో, అద్భుతమైన మాస్ ఫాలోయింగ్ తో, అగ్రశ్రేణి కథానాయకుడిగా ఒక పక్కన.. మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి వచ్చి.. రాజకీయం రంగంలో సైతం పేదవారికి అధికారం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూ.. ఇవాళ మనందరి అభిమాన ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏ మాటలు అయితే చెప్తారో వాటిని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దేశభక్తి, జాతీయ వాదం గురించి ఆయన పదే పదే మాట్లాడుతుంటారు. హరి హర వీరమల్లు టైటిల్ చూసినా, కథాంశం చూసినా నాకు అనిపించేది ఒక్కటే.. దేశంలోని యువతకు దేశభక్తి, జాతీయ వాదం గురించి చాటిచెప్పేలా ఈ సినిమా ఉంటుంది. ఇంతకాలం ఈ సినిమా కోసం నిలబడిన రత్నం గారికి అభినందనలు. ఈ సినిమాలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు.” అన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ, “శివాజీ కలలు కన్న సామ్రాజ్య స్థాపన కోసం హరి హర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో ఈ సినిమాలో చూడబోతున్నాం. జూలై 24 ఎప్పుడు వస్తుందా అని మీ అందరితో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆవేశం, ఒక ఉద్వేగం. ఎంతో ఉన్నతమైన వ్యక్తి. అలాగే ఎ.ఎం. రత్నం గారు ఎంతో ధైర్యమున్న వ్యక్తి, ఎన్నో హిట్ సినిమాలు తీసిన వ్యక్తి. ఇప్పుడు కళ్యాణ్ గారితో ఒక సంచలనాన్ని సృష్టించడానికి ముందుకొస్తున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

ప్రముఖ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి. చాలా గొప్పవాడు. 17 ఏళ్ళ వయసు నుంచి పవన్ కళ్యాణ్ ని చూస్తున్న వ్యక్తిగా నాకు తెలుసు. అప్పటి నుంచే ఈ సమాజానికి ఏదో చేయాలనే తపనతో ఉండేవాడు. తనంతట తాను వేసుకున్న బాటలో నడిచి వెళ్ళాడు తప్ప.. ఎవరో వేసిన బాటలో వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. తన బాటలో వస్తున్న ముళ్ళు, అవాంతరాలు, కష్టాలు, సుఖాలు.. తనంతట తాను ఎదురుతిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప.. ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు. ఆయన వేసుకున్న బాటలో పదిమందిని నడిపిస్తూ వచ్చాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనొక స్వయం శిల్పి. తనను తాను చిక్కుకున్న శిల్పి. డెస్టినీనే ఆయనను నడిపిస్తుంది. అనుకోకుండా నటుడు అయ్యారు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అయ్యారు. లేచిన కెరటం గొప్పది కాదు, పడి లేచిన కెరటం గొప్పది. ఎంతమంది ఎన్నయినా అనుకోనివ్వండి. సముద్రమంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే.. స్ట్రయిట్ నిలబడి చెప్పగల ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. పుట్టుక నీది, చావు నీది.. బ్రతుకంతా దేశానిది. ఈ మాట పవన్ కళ్యాణ్ గారికి సరిగ్గా సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.” అన్నారు.

ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, “నేను ఎన్నో సినిమాలు నిర్మించాను. కానీ, నాకు ఈ సినిమా ప్రత్యేకమైనది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా కాబట్టి. అలాగే పవన్ కళ్యాణ్ గారు నటించిన మొదటి హిస్టారికల్ ఫిల్మ్, మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ ను నిర్మించినందుకు నాకెంతో గర్వంగా ఉంది. సినిమాల ద్వారా ఎంతో కొంత సందేశం ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఈ సినిమా కూడా వినోదం అందించడంతో పాటు, ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం చూస్తారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాము” అన్నారు.

చిత్ర నిర్మాత ఎ. దయాకర్ రావు మాట్లాడుతూ, “ఆరు సంవత్సరాల తర్వాత, అనేకమంది కృషి ఫలితంగా మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం అభిమానులకు విందు ఇవ్వడానికి వస్తోంది. జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రం.. అభిమానులకు పెద్ద ఉత్సాహాన్ని, అంతకంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తుంది. మేము కష్టపడి తీశాము. ఇక ఆదరించాల్సిన బాధ్యత అభిమానులపైనే ఉంది. ట్రైలర్ చూశారు కదా. దానికి ఎన్నో రెట్లు సినిమా ఉండబోతుంది. అభిమానులు ఇదే ఉత్సాహంతో సినిమాకి ఘన విజయం అందిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “హరి హర వీరమల్లు టైటిల్ పెట్టిన క్రిష్ గారికి ముందుగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో కనిపిస్తారు. ఔరంగజేబు అంటే పవర్ ఫుల్ మొఘల్ కింగ్. అంత పవర్ ఫుల్ రూలర్ కి ఒక వ్యక్తిని చూస్తే నిద్ర పట్టేది కాదు. అది ఎవరంటే మన ఛత్రపతి శివాజీ. ఆయన అనారోగ్యంతో 1680లో చనిపోయారు. ‘హరి హర వీరమల్లు’ కథ 1684లో స్టార్ట్ అవుతుంది. ఛత్రపతి శివాజీ చివరి కోరిక ఏంటంటే.. మొఘల్స్ నుంచి జ్యోతిర్లింగాలు కాపాడాలని, కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కాపాడాలని. ఆయన మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే వీరమల్లు. ప్రతి శతాబ్దానికి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు. ఈ శతాబ్దానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైట్ డిజైన్ చేశారు. దానిని చూసి ఈ కథని ధర్మం కోసం జరిగే యుద్ధంగా మలిచాము. ఆ ఫైట్ ని త్రివిక్రమ్ గారికి చూపిస్తే ఎంతగానో ప్రశంసించారు. మా నాన్న ఎ.ఎం. రత్నం గారి గురించి చెప్పాలంటే.. అందరూ వాళ్ళ పిల్లలకి ఆస్తి సంపాదించి ఇస్తారు, మాకు మా నాన్న మంచి సంపాదించి ఇచ్చారు. ఆ పేరు వల్లే ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ‘పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసి.. రెండు గంటలు నీ గురించి మాట్లాడుతూ అభినందించారు’ అని త్రివిక్రమ్ గారు చెప్పారు. ఆ మాట విని నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాకు ఈ అవకాశమిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది.” అన్నారు.

చిత్ర కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “ఈరోజు నాకు ఒక ఎమోషనల్ డే లాగా ఉంది. ఎందుకంటే, ఈరోజు కోసం చాలా కాలంగా ఎదురుచూశాను. పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమానిని. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎ.ఎం. రత్నం గారికి మనస్ఫూరిగా సెల్యూట్ చేస్తున్నాను. ఆయనలా సినిమాని ఎవరూ మోయలేరు అనిపిస్తుంది. రత్నం గారి కోసం ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ‘ఈసారి డేట్ మారదు, రికార్డులు మారతాయి” అని జ్యోతికృష్ణ గారు చెబుతుంటారు. ఆయన మాట నిజం కావాలని ప్రార్థిస్తున్నాను. కీరవాణి గారు అద్భుతమైన సంగీతం అందించారు. మనోజ్ పరమహంస గారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

Record-Breaking Opening For “Bhairavam” On ZEE5; Crosses 100 Million Streaming Minutes

ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న జీ5 ..దేశంలోని ఓటీటీ మాధ్య‌మాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూనే ఉంది. దేశంలో వ‌న్ ఆప్ ది బిగ్గెస్ట్ ఓటీటీ మాధ్య‌మాల్లో ఒకటైన జీ5 ఇప్పుడు భైర‌వం సినిమాతో ఆక‌ట్టుకుంటోంది. మే 30న థియేట‌ర్స్‌లో విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ‘భైర‌వం’ మూవీ జీ5లో జూలై 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సిల్వ‌ర్ స్క్రీన్‌పై అల‌రించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టికే 100 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో భైర‌వం సినిమా ఆడియెన్స్‌ను అల‌రిస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్‌, మంచు మ‌నోజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఆనంది శంక‌ర్‌, దివ్యా పిళ్లై, ఆనంది కీల‌క పాత్రల్లో మెప్పించారు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఓ గ్రామంలోని ముగ్గురు స్నేహితుల మ‌ధ్య న‌డిచే క‌థ‌. గ్రామానికి చెందిన ఆల‌య భూముల‌పై ఓ రాజ‌కీయ నాయ‌కుడు క‌న్నేస్తాడు. అత‌ను వాటి కోసం ఏం చేశాడు. ముగ్గురి స్నేహితుల జీవితాలు ఎలా మ‌లుపు తిరిగాయ‌నేదే భైర‌వం క‌థ‌. స్నేహం, ల‌వ్, ఎమోష‌న్స్ ప్ర‌ధాన అంశాలుగా తెర‌కెక్కిన ఈ సినిమా వంద మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించ‌టం విశేషం.

ఈ చిత్రానికి హరి కె వేదాంతం సినిమాటోగ్రఫర్‌గా, శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా పని చేశారు. జూలై 18 జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ‘భైరవం’ చిత్రాన్ని తప్పక చూడండి.

ZEE5 గురించి…

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

Actor Yogi Babu Birthday Poster Released from the Movie “Gurram Paapi Reddy”

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఈ రోజు “గుర్రం పాపిరెడ్డి” సినిమా నుంచి ప్రముఖ నటుడు యోగిబాబుకు బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో యోగిబాబు ఉడ్రాజు అనే పాత్రలో సందడి చేయబోతున్నారు. ఆయన పర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. పర్పెక్ట్ డార్క్ కామెడీ మూవీగా “గుర్రం పాపిరెడ్డి” సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో డిఫరెంట్ గా డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ను హైదరాబాద్ సిటీ బ్యాక్ డ్రాప్ లో కాంటెంపరరీగా, స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తున్నారు దర్శకుడు మురళీ మనోహర్.

నటీనటులు – నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, తదితరులు

టెక్నికల్ టీమ్

సమర్పణ – డా. సంధ్య గోలీ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ శ్రీనివాస్)
నిర్మాతలు – వెను సద్ది , అమర్ బురా, జయకాంత్ (బాబీ)
రచన, దర్శకత్వం – మురళీ మనోహర్

YRF to celebrate 25 years of cinematic legacy of Hrithik Roshan & NTR by unveiling WAR 2 on 25th July!

Number 25 has a huge significance in #War2! Aditya Chopra has managed a casting coup by bringing together two of the biggest icons of Indian cinema, Hrithik Roshan & NTR in YRF Spy Universe’s WAR 2 directed by Ayan Mukerji.

It is sheer coincidence that both Hrithik Roshan & NTR are marking 25 years of their cinematic journey this year and YRF wants to celebrate this moment by choosing 25th of July to unveil the trailer of the biggest event film of the year, War 2!

YRF, today, posted the trailer launch announcement to praising Hrithik and NTR’s contribution to Indian cinema. The company wrote, “In 2025, 2 Icons of Indian cinema complete 25 years of their glorious cinematic journey. To celebrate this once in a lifetime moment, YRF marks July 25 as the trailer launch date of WAR 2!! Here’s to the most epic clash of the TITANS!! Mark your calendars.”

War 2 is set to release in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! It also stars Kiara Advani as the female lead.

I will stand by Producer Am Rathnam for his efforts-PawanKalyan at Hari Hara Veeramallu Event

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా చిత్రం బృందం ఘనంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “మీడియా మిత్రులతో రాజకీయాల పరంగా చర్చించాను కానీ, ఇలా ఒక సినిమా కోసం పెద్దగా మాట్లాడలేదు. సినిమాకి సంబంధించి మాట్లాడటానికి నేను మొహమాటపడతాను. సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప.. ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అనుకోకుండా నటుడిని, సాంకేతిక నిపుణుడిని అయ్యాను. సినిమా గురించి మీడియాతో మాట్లాడకపోవడానికి నాకు పొగరో, అహంకారమో కారణం కాదు. సినిమా గురించి చెప్పుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే.. ఎ.ఎం. రత్నం గారి కోసం పెట్టాను. సినిమా బతకాలి. సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకొని ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే.. ఈవెంట్ తర్వాత మళ్ళీ మీడియా మిత్రులతో మాట్లాడే అవకాశం రాదేమో అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అజ్ఞాతవాసి సినిమాలో త్రివిక్రమ్ గారు ఒక మాట రాశారు. “ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది”. అలాంటిది ఒక సినిమా చేయడమంటే ఎన్ని యుద్ధాలు చేయాలి. ఆర్థికంగా కావచ్చు, సృజనాత్మకంగా కావచ్చు. నేను సినిమాల్లోకి రాకముందు ఎ.ఎం. రత్నం గారి లాంటి వ్యక్తి నా నిర్మాత అయితే బాగుండు అనుకునేవాడిని. ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాలను తెలుగులో విడుదల చేసి, స్ట్రయిట్ సినిమాల స్థాయిలో ఆడించి సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. క్రియేటివ్ గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. ఏం చేసినా, ఎన్ని ఎదురైనా సినిమా బాగా రావాలని అనుకుంటాం. ఈ సినిమాకి ప్రత్యేకించి ఎ.ఎం. రత్నం గారి తపన చూశాను. ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయి.. దర్శకత్వానికి, క్రియేటివ్ పార్ట్ కి దూరమైన తర్వాత.. నా ప్రధాన దృష్టి రాజకీయాలపై ఉన్న సమయంలో.. నా దగ్గరకు వచ్చి మళ్ళీ మీరు సినిమా చేయాలని అడిగినప్పుడు నా బెస్ట్ ఇచ్చాను నేను. ప్రస్తుతం నేను టైం ఇవ్వలేను. అలాంటిది నేను ఒక్క క్లైమాక్స్ కే దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మే నెలలో మండుటెండలో షూట్ చేశాము. నేను ఎప్పుడో దేశ విదేశాల్లో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు నాకు ఈ సినిమాకి పనికొచ్చాయి. కొరియోగ్రాఫర్స్ తో కూర్చొని క్లైమాక్స్ ను ప్రత్యేకంగా రూపొందించాము. సినిమాకి ఇదే ఆయువుపట్టు. సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం.. హైదరాబాద్ సుల్తాన్ల దగ్గరకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ప్రయాణం ఎలా జరిగింది? ఈ నేపథ్యంలో జరిగే కథ ఉంది. దీనికి పునాది వేసింది క్రిష్ జాగర్లమూడి గారు. ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. ఆయన, రత్నం గారు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నచ్చి వెంటనే ఓకే చేశాను. అయితే కరోనా అనేది సినిమాపై తీవ్ర ప్రభావం చూపించింది. నేను ఎ.ఎం. రత్నం గారిని దగ్గరనుండి చూశాను. ఒకప్పుడు ఆయన వెంట నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు, దర్శకులు తిరిగేవారు. ఖుషి సినిమా సమయంలో మాకు ఒక నెల ముందే ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది. మాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు. అలాంటి వ్యక్తి నలిగిపోతుంటే నాకు బాధేసింది. ఇది డబ్బు గురించో, విజయం గురించో కాదు.. మన వాళ్ళ కోసం, సినీ పరిశ్రమ కోసం నమ్మి నిలబడటం. కొన్ని కారణాల వల్ల క్రిష్ గారు ఈ సినిమా పూర్తి చేయలేకపోయినప్పటికీ.. ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాకి పునాది వేసిన ఆయనకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. నేను ఖుషి సినిమా చేస్తున్న సమయంలో జ్యోతికృష్ణ లండన్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. ఆయనతో మాట్లాడుతుంటే సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించింది. ఈ సినిమా అసలు పూర్తవుతుందా లేదా అని మాటలు వినిపిస్తున్న సమయంలో.. మాకు ప్రాణవాయువు ఇచ్చిన వ్యక్తి కీరవాణి గారు. నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప.. సినిమా గురించి పెద్దగా మాట్లాడను. కానీ, ఈ సినిమాకి మాట్లాడటం అవసరం అనిపించింది. నిర్మాతలు కనుమరుగు అవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి, ఒడిదుడుకులు తట్టుకొని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. నా బిజీ షెడ్యూల్ వదిలేసి, ప్రత్యర్థులు నన్ను విమర్శిస్తున్నా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సినీ పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. ఇక్కడ ఎందరో మీడియా మిత్రులు నాకు వ్యక్తిగతంగా తెలుసు. సినిమా అంటే నాకు అపారమైన గౌరవం. రత్నం గారి లాంటి నిర్మాత ఇబ్బంది పడకూడదని.. ఈ సినిమాని నేను నా భుజాలపైకి తీసుకున్నాను. రత్నం గారు, జ్యోతికృష్ణ గారు, మనోజ్ పరమహంస గారు నిద్రలు మానుకొని మరీ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. అలాగే నిధి అగర్వాల్ సినిమా ప్రమోషన్ బాధ్యతను తీసుకున్నారు. ఈ సినిమా అనాధ కాదు.. నేనున్నాను అని చెప్పడానికి వచ్చాను ఈరోజు. కోట్లాది మంది ప్రజలకు అండగా ఉండేవాడిని, దేశంలో ఉన్న సమస్యలకు స్పందించేవాడిని.. అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను. ఒక చిన్న మేకప్ మ్యాన్ స్టార్ట్ అయ్యి.. దర్శకుడిగా, రచయితగా, నిర్మతగా అంచలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు రత్నం గారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టిన మౌనంగా ఉంటారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా.. ప్రతిభ ఉంటే ఎవరైనా సినీ రంగంలో రాణించవచ్చు. అందుకే సినీ పరిశ్రమ అంటే నాకు అంత గౌరవం. సినిమా చేయడం అనేది ఒక యజ్ఞం లాంటిది. డబ్బులు మిగులుతాయో లేదో కూడా తెలీదు. రత్నం గారు మంచితనం గురించి, ఆయన చేసిన మంచి సినిమా గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. పాలనా సమయానికి ఇబ్బంది కలగకుండా, నా వ్యక్తిగత సమయాన్ని ప్రతి రోజూ రెండు గంటలు కేటాయించాను. అందుకు తగ్గట్టుగా జ్యోతికృష్ణ, పరమహంస గారు షూట్ ని ప్లాన్ చేశారు. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ ని ఎలా చేయబోతున్నామో జ్యోతికృష్ణ ముందే ప్రీ విజువలైజ్ చూపించారు. ఆయన సత్తా ఉన్న దర్శకుడు. సాంకేతిక విభాగాల మీద మంచి పట్టుంది. అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంస గారు తోడయ్యారు. రత్నం గారి అనుభవంతో వీరిద్దరూ కలిసి సినిమాని గొప్పగా మలిచారు. నాకు ఇష్టమైన నిర్మాత, తెలుగు పరిశ్రమకు అండగా ఉన్న నిర్మాత రత్నం గారి బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రత్నం గారి పేరుని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను ప్రతిపాదించాను. నా నిర్మాత అని కాదు.. ఇలాంటి వ్యక్తి ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఓ మంచి అనుభూతిని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. సినిమా అనేది మా జీవితంలో ఎంతో కొంత ప్రభావాన్ని చూపించాలి. అలాంటి ప్రభావాన్ని, ఎనర్జీని ఇచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారిని కలవాలని మీడియా వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ కి రావడం మనసుకి ఆనందాన్ని కలిగించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు డిజైన్ చేసిన ఒక ఫైట్ ఉంది. ఆ ఎపిసోడ్ దాదాపు 20 నిమిషాలు ఉంటుంది. ఆ ఫైట్ లోనే ఒక కథ ఉంటుంది. ఆ ఒక్క ఎపిసోడ్ కి కీరవాణి గారికి సంగీతం చేయడానికి పది రోజులు పట్టింది. ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే.. పవన్ గారు చూసే వీరమల్లు వేరే. పవన్ గారు అనుకున్న సినిమా వేరే. ఆయనలో ఉన్న ఫైర్ లో నుంచి డిజైన్ చేసిందే ‘ధర్మం కోసం యుద్ధం’. 17వ శతాబ్దం మొఘల్స్ నేపథ్యంలో ఉండే సినిమా ఇది. ఆ సమయంలో ఔరంగజేబుకి, వీరమల్లు అనే కల్పిత పాత్రకి మధ్య జరిగే యుద్ధం లాంటిది ఈ సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పవన్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఈ సినిమా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి నేను ఒక్క సెకను కూడా విశ్రాంతి తీసుకోలేదు. మా నాన్న ఎ.ఎం.రత్నం గారి కసి, పవన్ గారి కళ్ళలోని ఫైర్.. నన్ను అలా అవిశ్రాంతంగా పనిచేసేలా చేశాయి. నాతో పాటు నా టీం అంతా నిద్ర కూడా మాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. కీరవాణి గారు, మనోజ్ పరమహంస గారి సపోర్ట్ ను మర్చిపోలేను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని తెరమీద ఎలా చూడాలని ఎదురుచూస్తున్నామో.. ఆ కోరిక హరి హర వీరమల్లుతో నెరవేరనుంది. జూలై 24న అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. హరి హర వీరమల్లు అనేది నా సినీ జీవితంలో ప్రత్యేకమైన చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎ.ఎం.రత్నం గారికి ధన్యవాదాలు. జ్యోతి కృష్ణ గారు ఈ సినిమాని గొప్పగా మలిచారు. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

Dhanush’s ‘Mr. Karthik’ Movie grand re-released on July 27th

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా రీచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించిన చిత్రం మయక్కమ్ ఎన్న. తెలుగులో ఈ చిత్రం మిస్టర్ కార్తీక్ గా 2016 లో విడుదలై రొమాంటిక్ లవ్ స్టోరీగా మంచి విజయం సాధించింది. జివి. ప్రకాష్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

ధనుష్ పుట్టినరోజు సందర్భంగా మిస్టర్ కార్తీక్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. జులై 27న ఈ చిత్రాన్ని భారీగా థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఓం శివగంగా ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి కాడబోయిన లతా మండేశ్వరి సమర్పణలో నిర్మాత కాడబోయిన బాబురావు ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు.

దర్శకుడు శ్రీ రాఘవ కొన్ని హృదయానికి దగ్గరగా ఉండే సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కిస్తారు, అలా ఈ మిస్టర్ కార్తీక్ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే అనేక ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇటీవల తమిళంలో ఈ సినిమా రీ రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇదే స్థాయిలో తెలుగులో సక్సెస్ కానుంది ఈ మూవీ.

Veteran Producer A.M. Rathnam interview about highly anticipated Movie ‘Hari Hara Veera Mallu’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆ ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్ర బృందం. జూలై 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు. అలాగే తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన లెజండరీ నిర్మాత ఎ.ఎం. రత్నం.. సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

హరి హర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుంది?
17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ ఇది. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లుకోవడం జరిగింది. హరి హర వీరమల్లు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే.. హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక. అలాగే వీరుడిని సూచించేలా వీరమల్లు అని పెట్టాము.

హరి హర వీరమల్లు ప్రయాణం గురించి చెప్పండి?
నేను ‘భారతీయుడు’ సహా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాను. అయితే నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పూర్తి చేయగలిగే సాధారణ చిత్రం కాదు. అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్ తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే ఆలస్యమైంది. బాగా ఆలస్యమవవడంతో సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అయితే ట్రైలర్ తో అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. నేను నిర్మించిన సినిమాల్లో 90 శాతానికి పైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతో చెప్తున్నాను.. హరి హర వీరమల్లు ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.

సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ముందే అనుకున్నారా?
మొదట రెండు భాగాలని అనుకోలేదు. సినిమా అనేది వినోదంతో పాటు, సందేశాన్ని అందించాలనేది నా భావన. నేను రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలు అలాగే ఉంటాయి. వీరమల్లు అనేది చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే.. ఎక్కువమందికి చేరువ అవుతుందని భావించాము. అలా చర్చల్లో కథ స్పాన్ పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నారా?
జూలై 24 తెల్లవారుజాము నుంచి షోలు వేయాలని మేము భావించాము. కానీ అభిమానులు ముందురోజు రాత్రి నుంచే షోలు వేయాలని కోరుతున్నారు. వారి కోరిక మేరకు జూలై 23 రాత్రి నుంచి షోలు వేసే ఆలోచనలో ఉన్నాము.

పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం గురించి?
ఖుషి, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చేసిన మూడో చిత్రమిది. పేరుకి మూడు సినిమాలే కానీ.. మా మధ్య 25 సంవత్సరాల అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయన నాకు ఎక్కువ ఇష్టం. సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఖుషి సమయంలో ఆయన ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయాను. అది ప్రేమ కథా చిత్రం అయినప్పటికీ.. ఓ సన్నివేశంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పారు. అలాగే ఒక పాటలో దేశభక్తిని చాటుకున్నారు. సినిమాల్లో చూపించే ఇలాంటి విషయాలు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తాయి. హరి హర వీరమల్లు కూడా విజయవంతమైన చిత్రంగా నిలవడమే కాకుండా, ప్రేక్షకుల్లో ఆలోచన కలిగిస్తుంది.

పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా దృష్టి ఉంటుంది. ఆ ఒత్తిడి ఏమైనా మీపై ఉందా?
ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని మేము బాధ్యతగా భావించి, మరింత శ్రద్ధగా సినిమాని రూపొందించాము. పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. అలాగే పవన్ గారి అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను.. ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది.

సినిమా ఆలస్యమైంది కదా.. పవన్ కళ్యాణ్ గారి సహకారం ఎలా ఉంది?
పవన్ కళ్యాణ్ గారి సహకారం లేకుండా ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడం సాధ్యం కాదు. పవన్ గారంటే నాకెంత ఇష్టమో.. అలాగే నేనంటే కూడా ఆయనకి ఇష్టం. మేకర్ గా నన్ను గౌరవిస్తారు. పవన్ గారు పూర్తి సహకారం అందించారు కాబట్టే.. ఈ సినిమా ఇంత గొప్పగా తీయగలిగాము. అలాగే టీం అందరూ ఎంతో సహకరించారు. అందరం కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమాని పూర్తి చేశాము.

మీ కుమారుడు జ్యోతికృష్ణ గారి గురించి?
మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ, జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో ఈ కథని చూశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా.. ఇండియన్ జోన్స్ తరహాలో సినిమాని గొప్పగా మలిచాడు. సాంకేతికంగా కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు. జ్యోతికృష్ణ పనితీరు చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశంసించారు.

A Visual Tribute to Murali Nayak’s Sacrifice for the Nation “Desam Kosam Manalo Okkadu

“ఆపరేషన్ సిందూర్”లో మన దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలొడ్డిన మురళీ నాయక్ సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం “దేశం కోసం మనలో ఒక్కడు”. యువ సంచలనం గోపివర్మ తెరకెక్కించిన ఈ ఇండిపెండెంట్ చిత్రాన్ని ప్రసాద్ (బాబి) నిర్మించారు. కోటేశ్వరరావు, రాజశేఖర్, కృష్ణవేణి, నాగరాజు, శ్వేత, సింధు, నాగబాబు, జ్యోతి, రాజు తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని హైద్రాబాద్ ప్రసాద్ లాబ్ లో జులై 19న లాంఛనంగా విడుదల చేశారు!!

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విడుదల వేడుకలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శ్రీమతి గిడుగు కాంతి కృష్ణ, ప్రముఖ రాజకీయ నాయకులు గట్టు రామచంద్రరావు, సీనియర్ పాత్రికేయులు అక్కినేని శ్రీధర్, ధీరజ అప్పాజీ, జూనియర్ రాజశేఖర్ పాల్గొని, గోపివర్మ ను అభినందించారు. దర్శకుడిగా అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు!!

పెట్టిన పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా వెనక్కి వచ్చే అవకాశం లేదని తెలిసి కూడా, దేశం కోసం త్యాగం చేసిన మురళీ నాయక్ పై అమితమైన ఆరాధనతో ఈ చిత్ర నిర్మాణానికి ముందుకొచ్చిన నిర్మాత ప్రసాద్ కి దర్శకుడు గోపివర్మ కృతజ్ఞతలు తెలిపాడు. “దేశం కోసం మనలో ఒక్కడు” సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నామని, తన దర్శకత్వంలో మొదలైన “రాయలసీమ ప్రేమకథ” ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందని వివరించాడు. ఇంత గొప్ప చిత్రం నిర్మించే అవకాశం రావడం పట్ల నిర్మాత ప్రసాద్ (బాబి) గర్వం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి పని చేయడం, ఇందులో భాగం కావడం తమకు చాలా సంతోషంగా ఉందని.. నటీనటులు – సాంకేతిక నిపుణులు అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: ఎమ్.ఎన్. ఆర్., సినిమాటోగ్రఫీ: వెంకీ కనకాల, సంగీతం: హర్ష ప్రవీణ్, నిర్మాత: ప్రసాద్ (బాబి) కథ – స్క్రీన్ ప్లే – సంభాషణలు – దర్శకత్వం: గోపివర్మ!!